ప్రేమించలేదని ధన్యను కిరాతకంగా..
కోయంబత్తూరు: తనను ప్రేమించడం లేదన్ని 23 ఏళ్ల యువతిని తన ఇంట్లోనే కిరాతకంగా హతమార్చాడు ఓ దుర్మార్గుడు. ఆ తర్వాత విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలోని అన్నూర్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. 23 ఏళ్ల ధన్య ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగినిగా పనిచేస్తూ తన తండ్రి టైలరింగ్ పనిలోనూ సాయంగా ఉంటోంది.
బుధవారం ఆమె తల్లిదండ్రులు సోమసుందరం, శారద ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఊరెళ్లారు. వారి తిరిగొచ్చి చూడగా.. నెత్తుటి మడుగులో ధన్య విగతజీవిగా కనిపించింది. దీంతో గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాము పొరుగూరుకు వెళ్లేటప్పుడు ఇంటి ప్రధాన ద్వారానికి తాళం వేశామని, వెనుకవైపు మార్గం నుంచి ఇంట్లోకి చొరబడి దుండగుడు ఈ కిరాతకానికి పాల్పడి ఉంటాడని వారు తెలిపారు. ధన్య శరీరం నిండా కత్తి గాట్లు, పోట్లు ఉన్నాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో సంఘటన స్థలంలోనే ఆమె ప్రాణాలు విడిచింది.
ఓ వ్యక్తి తమ బిడ్డను ప్రేమించమని తరచూ వేధిస్తున్నాడని, వాడే ఈ కిరాతకానికి ఒడిగట్ట ఉండవచ్చునని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు నిందితుడు 27 ఏళ్ల జకీర్‌ను గుర్తించారు. అప్పటికీ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టి విషమస్థితిలో ఉన్న అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.
బాధితురాలు ధన్యకు ఇటీవల వివాహ నిశ్చితార్థం జరిగిందని, త్వరలోనే పెళ్లి జరగనుండగా ఇంత దారుణం జరిగిందని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు అన్నూర్‌లో గురువారం బంద్ నిర్వహించారు.