low quality food
-
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. పాచిపోయిన బిర్యానీ, అన్నంలో ఈగలు
సాక్షి, వికారాబాద్: పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పల్లెలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధుల భయం కనిపిస్తోంది. ఈ సమయంలో కల్తీ ఆహారం తీసుకున్నా, నాణ్యతా ప్రమాణాలు పాటించని చిరుతిండ్లు తిన్నా రోగాల బారిన పడక తప్పదు. జిల్లాలో అనేక హోటళ్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లు, దాబాలు వెలిశాయి. పలు చోట్ల నాసిరకం, కల్తీ పదార్థాలు, సరుకులతో వంటలు చేస్తున్నారు. దీంతో జనం అనారోగ్యం పాలవుతున్నారు. హోటళ్లు, దాబాలు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లకు.. కిరాణా షాపుల యజమానులు నాణ్యత లేని పదార్థాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సదరు దుకాణాలపై దాడులు చేసి తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. జిల్లాలో పూర్తి స్థాయి ఫుడ్ ఇన్స్పెక్టర్ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సంబంధిత కార్యాలయంలోనూ సరిపడా సిబ్బంది లేక సమా ధానం చెప్పే వారు కరువయ్యారు. జిల్లాలో ఇన్చార్జ్ ఫుడ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అధికారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో హోటళ్లు, దాబాలు, టిఫిన్ బండ్ల నిర్వాహకులు ఆడిందే ఆట పాట అనేలా వ్యాపారం సాగిస్తున్నారు. అనుమతులు లేకుండానే జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా హోటళ్లు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు వెలుస్తున్నాయి. వీటిలో తయారు చేసే భోజన సామగ్రి, నూనె నాణ్యత విషయాలు ఎవరికీ తెలియట్లేదు. తక్కువ ధరకు లభించే నాసిరకం సరుకులతో వంటకాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. చాలా హోటళ్లకు కనీసం మున్సిపల్, గ్రామ పంచాయతీల అనుమతి కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు పెద్దగా పంటించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదే అదనుగా వ్యాపారులు కల్తీ వస్తువులతో హోటళ్లు నడిపిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. పాచిపోయిన బిర్యానీ వికారాబాద్‌లోని పలు బిర్యానీ సెంటర్లలో పాచి పోయిన బిర్యానీ విక్రయిస్తున్నారే ఆరోపణలున్నాయి. రెండు మూడు రోజుల పాటు చికెన్‌ను ఫ్రిజ్‌లో పెట్టి బిర్యానీ చేసి అమ్ముతున్నారు. ఎన్టీఆర్ చౌరస్తాలోని ఓ బిర్యానీ సెంటర్లో తీసుకున్న అన్నంలో ఇటీవల పురుగులు వచ్చాయి. ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులు కొద్దిసేపు నిర్వాహకులతో గొడవపడి వెళ్లిపోయారు. న్యూ గంజ్‌లోని మరో బిర్యానీ సెంటర్లో వారం రోజుల క్రితం అన్నంలో ఈగలు దర్శనమిచ్చాయి. ఇదేమిటని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా, ఇదే బిర్యానీని మిగతా వారికి వడ్డించడం గమనార్హం. మరో హోటల్ నుంచి తీసుకువెళ్లిన ఇడ్లీ సాంబారులో బొద్దింక వచ్చిందని బాధితులు తెలిపారు. ఇలా ప్రతీ హోటల్లో నాసిరకం ఆహారం అమ్ముతున్నారనే ప్రచారం సాగుతోంది. ఎప్పుడూ తాళమే.. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఫుడ్ సేఫ్టీ జిల్లా కార్యాలయం ఉంది. ఎప్పుడు చూసినా ఇది తాళం వేసే కనిపిస్తోంది. జిల్లా ఏర్పడ్డ తర్వాత గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ అధికారి పోస్టులు కేటాయించారు. జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉండాలి. కానీ ఈ కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్కు వికారాబాద్ ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు జిల్లాలో ఒక్కచోట కూడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. హోటళ్లు, బేకరీలు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఇతర ఆహార పదార్థాల షాపులను తనిఖీ చేయాల్సి ఉన్నా అధికారుల జాడ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లో నాణ్యత లేని సరుకులు, ఇతర ఆహార పదార్థాలు జోరుగా విక్రయిస్తుండటంతో వాటిని కొనుగోలు చేస్తున్న ప్రజలు అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జిల్లాలో తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు. -
కుళ్లిన కూరగాయలు, నీళ్ల చారు..వామ్మో! ఇదేం భోజనం.. ఎలా తింటారు?
పురుగులు పట్టిన ఈ క్యాలీఫ్లవర్‌ను చూస్తేనే ఏదోలా ఉంది. దానికి ఫంగస్ వచ్చినా విద్యార్థుల ఆరోగ్యం ఏమైతే మాకేంటీ అన్నట్లుగా వీటినే కోసి వండి పెడుతున్నారు. నగరంలోని ఇంటిగ్రేటెడ్ ప్రీమెట్రిక్ హాస్టల్లో తీసిన ఫొటో ఇది. ఈ చిత్రంలో కుళ్లిపోయి కనిపిస్తున్న టమాటాలు నగరంలోని ఎస్సీ బాలుర వసతి గృహం(బి)లోనివి. టమాట రేటు తగ్గినా కూడా పురుగులు పట్టి కుళ్లిపోయిన టమాటాలనే నిరుపేద విద్యార్థులకు వండి పెడుతున్నారు. సాక్షి,ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఎస్సీ ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో భోజనం అధ్వానంగా మారింది. పలు హాస్టళ్లలో కుళ్లిపోయి పురుగులు పట్టిన కూరగాయలు, నీళ్ల చారే భోజనంగా వడ్డిస్తున్నారు. ఉన్నతాధికారులుండే జిల్లా కేంద్రంలోని ఎస్సీ ప్రీ మెట్రి క్ హాస్టళ్లలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే.. మండల, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్లలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ధరలు పెరిగాయనే సాకుతో మెనూలో నుంచి రెండు గుడ్లు, రెండు అరటి పండ్లు తొలగించినా నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదు. కుళ్లిపోయి పురుగులు పట్టిన కూరగాయలు, నీళ్ల చారే స్పెషల్ భోజనంగా మారింది. వార్డెన్ల కక్కుర్తి తో విద్యార్థులకు రుచికరమైన భోజనం అందని ద్రాక్షలా మారింది. ప్రశ్నించలేని విద్యార్థులు వారికి ఏది పెడితే అది తింటున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది. ఫుడ్ పాయి జన్ లాంటి ప్రమాదాలు సంభవించే అవకాశముంది. జిల్లాలో ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 32 ప్రీమె ట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 1,400 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. సంతలో అగ్గువకు తెచ్చి.. పైసలు మిగులుచ్చుకోవడానికి వార్డెన్లు కక్కుర్తి పడుతున్నారు. అంగళ్లు, మార్కెట్లలో వారానికి సరిపడా కూరగాయలను ఒకేసారి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ సమయంలో కూరగాయలు కుళ్లినవి, పురుగులు పట్టినవి ఉండడంతో అవి రెండు, మూడు రోజులకే పాడవుతున్నారు. టమాలు, వంకాయలు, క్యాలీ ఫ్లవర్, బెండకాయలు, ఉల్లిగడ్డలు, ఆకు కూరలు నాణ్యతగా లేకున్నా వాటినే విద్యార్థులకు వండి పెడుతున్నారు. నీళ్ల చారు, కుళ్లిన కూరగాయలే వడ్డిస్తున్నారు. తూతూ మంత్రంగా మెనూ.. ఎస్సీ హాస్టళ్లలో రూపొందించిన భోజన మెనూ ను వార్డెన్లు తూతూ మంత్రంగానే అమలు చేస్తున్నారు. అసలు మెనూ ప్రకారం ప్రతీరోజు ఉదయం రాగిజావా పాలను అందించాలి. అలాగే బ్రేక్ ఫాస్ట్‌గా వారంలో ఒక రోజు ఉప్మా, పల్లి చట్నీ, రెండు రోజులు పులిహోర, వారంలో మూడు అరటిపండ్లు, అదే విధంగా రెండు రోజులు కిచిడి, సాంబారు, అలాగే ఒకరోజు అటుకుల ఉప్మా, ఆదివారం ఒకరోజు ఇడ్లీ, పల్లి చట్నీ అందించాలి. కాగా ప్రతీరోజు రాత్రి కూర గాయల భోజనం, పప్పు సాంబారు లేదా రసంతో పాటు పెరుగు అందించాలి. వారంలో మూ డు గుడ్లు కూడా ఇవ్వాలి. ప్రతి ఆదివారం మాంసాహారం(చికెన్) వండి ఒక్కో విద్యార్థికి 100 గ్రాముల చొప్పున పెట్టాలి. అలాగే ప్రతి సాయంత్రం స్నాక్స్ అందించాలి. కానీ ఈ మెనూ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదనే ఆరోపణలున్నాయి. మెనూలో ఉన్న వాటన్నింటిని వండి పెట్టినా విద్యార్థులకు సరిపోయేంత ఉండడం లేదు. -
నాణ్యతలేని సరుకుల సరఫరా
భద్రాచలం: ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే ఆశ్రమాలు, వసతి గృహాలకు నాణ్యమైన సరుకులను సరఫరా చేయాలని జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి మాలోతు సైదా అన్నారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఆశ్రమాలకు గిరిజన సహకార సంస్థ ద్వారా సరుకులు సరఫరా చేసే నిమిత్తం టెంటర్లను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలో విద్యనభ్యశించే విద్యార్ధుల సంక్షేమం కోసమని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. సరఫరా చేసే సరుకుల్లో నాణ్యత లోపిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతే కాకుండా పాఠశాలలకు అవసరాలకు అనుగుణంగా సకాలంలో వాటిని సరఫరా చేయాలన్నారు. ఈ విషయంలో అలసత్వంగావ్యవహరించే వారి కాంట్రాక్టులను రద్దు చేస్తామన్నారు. వసతి గృహాలకు సరఫరా చేసే నిత్యావసర సరుకులను జీసీసీ అధికారులు, ఏటీడబ్ల్యూవోలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, నాణ్యత ధృవీకరణ చేసిన మీదటే వాటిని పంపిణీ చేయాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తేలేదని ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. కార్యక్రమంలో జీసీసీ డివిజనల్‌మేనేజర్ విజయ్‌కుమార్; ఏటీడబ్ల్యూవో జహీరుద్ధీన్, సూపరింటింటెండ్ నారాయణ రెడ్డి, జీసీసీ మేనేజర్లు శంకర్, సతీషకుమార్, సత్యనారాయణ, రామాంజనేయలు తదితరులు పాల్గొన్నారు.