పురుగులు పట్టిన ఈ క్యాలీఫ్లవర్‌ను చూస్తేనే ఏదోలా ఉంది. దానికి ఫంగస్ వచ్చినా విద్యార్థుల ఆరోగ్యం ఏమైతే మాకేంటీ అన్నట్లుగా వీటినే కోసి వండి పెడుతున్నారు. నగరంలోని ఇంటిగ్రేటెడ్ ప్రీమెట్రిక్ హాస్టల్‌లో తీసిన ఫొటో ఇది.
ఈ చిత్రంలో కుళ్లిపోయి కనిపిస్తున్న టమాటాలు నగరంలోని ఎస్సీ బాలుర వసతి గృహం(బి)లోనివి. టమాట రేటు తగ్గినా కూడా పురుగులు పట్టి కుళ్లిపోయిన టమాటాలనే నిరుపేద విద్యార్థులకు వండి పెడుతున్నారు.
సాక్షి,ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఎస్సీ ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో భోజనం అధ్వానంగా మారింది. పలు హాస్టళ్లలో కుళ్లిపోయి పురుగులు పట్టిన కూరగాయలు, నీళ్ల చారే భోజనంగా వడ్డిస్తున్నారు. ఉన్నతాధికారులుండే జిల్లా కేంద్రంలోని ఎస్సీ ప్రీ మెట్రి క్ హాస్టళ్లలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే.. మండల, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్లలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ధరలు పెరిగాయనే సాకుతో మెనూలో నుంచి రెండు గుడ్లు, రెండు అరటి పండ్లు తొలగించినా నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదు.
కుళ్లిపోయి పురుగులు పట్టిన కూరగాయలు, నీళ్ల చారే స్పెషల్ భోజనంగా మారింది. వార్డెన్ల కక్కుర్తి తో విద్యార్థులకు రుచికరమైన భోజనం అందని ద్రాక్షలా మారింది. ప్రశ్నించలేని విద్యార్థులు వారికి ఏది పెడితే అది తింటున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది. ఫుడ్ పాయి జన్ లాంటి ప్రమాదాలు సంభవించే అవకాశముంది. జిల్లాలో ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 32 ప్రీమె ట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 1,400 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు.
సంతలో అగ్గువకు తెచ్చి..
పైసలు మిగులుచ్చుకోవడానికి వార్డెన్లు కక్కుర్తి పడుతున్నారు. అంగళ్లు, మార్కెట్లలో వారానికి సరిపడా కూరగాయలను ఒకేసారి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ సమయంలో కూరగాయలు కుళ్లినవి, పురుగులు పట్టినవి ఉండడంతో అవి రెండు, మూడు రోజులకే పాడవుతున్నారు. టమాలు, వంకాయలు, క్యాలీ ఫ్లవర్, బెండకాయలు, ఉల్లిగడ్డలు, ఆకు కూరలు నాణ్యతగా లేకున్నా వాటినే విద్యార్థులకు వండి పెడుతున్నారు. నీళ్ల చారు, కుళ్లిన కూరగాయలే వడ్డిస్తున్నారు.
తూతూ మంత్రంగా మెనూ..
ఎస్సీ హాస్టళ్లలో రూపొందించిన భోజన మెనూ ను వార్డెన్లు తూతూ మంత్రంగానే అమలు చేస్తున్నారు. అసలు మెనూ ప్రకారం ప్రతీరోజు ఉదయం రాగిజావా పాలను అందించాలి. అలాగే బ్రేక్ ఫాస్ట్‌గా వారంలో ఒక రోజు ఉప్మా, పల్లి చట్నీ, రెండు రోజులు పులిహోర, వారంలో మూడు అరటిపండ్లు, అదే విధంగా రెండు రోజులు కిచిడి, సాంబారు, అలాగే ఒకరోజు అటుకుల ఉప్మా, ఆదివారం ఒకరోజు ఇడ్లీ, పల్లి చట్నీ అందించాలి.
కాగా ప్రతీరోజు రాత్రి కూర గాయల భోజనం, పప్పు సాంబారు లేదా రసంతో పాటు పెరుగు అందించాలి. వారంలో మూ డు గుడ్లు కూడా ఇవ్వాలి. ప్రతి ఆదివారం మాంసాహారం(చికెన్) వండి ఒక్కో విద్యార్థికి 100 గ్రాముల చొప్పున పెట్టాలి. అలాగే ప్రతి సాయంత్రం స్నాక్స్ అందించాలి. కానీ ఈ మెనూ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదనే ఆరోపణలున్నాయి. మెనూలో ఉన్న వాటన్నింటిని వండి పెట్టినా విద్యార్థులకు సరిపోయేంత ఉండడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment