ఎల్పీజీ కస్టమర్లకు డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ : దేశాన్ని నగదు రహిత విధానంలోకి మార్చే విధంగా డిజిటల్ చెల్లింపుల ప్రోత్సహకానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు కృషిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్ లైన్ విధానంలో ఎల్పీజీని బుక్ చేసుకుని, చెల్లింపులు చేసుకునే వంటగ్యాస్ కస్టమర్లకూ రూ.5 డిస్కౌంట్ను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అందించనున్నాయి. ఆన్లైన్లో పేమెంట్ విధానంలో ఎల్పీజీని రీఫిల్ చేసుకునే ప్రతి కస్టమర్లకు ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్ అండ్ హెచ్పీసీఎల్ కంపెనీలు ఈ ఆఫర్ను అందిచనున్నట్టు తెలిసింది. రీఫిల్ కోసం వెబ్ బుకింగ్ చేసుకునేటప్పుడే నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కస్టమర్లు చెల్లింపులు చేయవచ్చని కంపెనీలు చెబుతున్నాయి.
డిస్కౌంట్ మొత్తం స్క్రీన్లపై డిస్ప్లే అవుతుందని అదే నికర మొత్తమని తెలిపాయి. రీఫిల్ ఆర్ఎస్పీలోంచి డిస్కౌంట్ మొత్తం రూ.5 తీసివేయగా మిగిలే మొత్తాన్ని కస్టమర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎల్పీజీ సిలిండర్ ఇంటివద్దకు డెలివరీ చేసిన సమయంలోనూ క్యాష్ మెమోలో ఈ డిస్కౌంట్ మొత్తాన్ని చూసుకోవచ్చు. పేమెంట్ విధాలను డిజిటల్ ప్లాట్ఫామ్లోకి మార్చడానికి అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ డిస్కౌంట్ ఆఫర్లను తీసుకొస్తున్నాయి. ఈ ప్రోత్సాహకాలు ఎక్కువమంది ఎల్పీజీ కస్టమర్లను నగదు రహిత విధానంలోకి మార్చడానికి దోహదం చేస్తాయని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వశాఖ చెబుతోంది.