'ఏదో ఒక రోజు నా రెండో భార్య గురించి చెప్తా'!
మాస్కో: ఏదో ఒక రోజు తన రెండో భార్య గురించి చెప్పి రష్యా ప్రజల సరదా తీరుస్తానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పరోక్షంగా చెప్పారు. ఓ సామాన్యుడు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వని ఆయన ఏదో ఒక రోజు మీ ప్రశ్నకు సమాధానం చెప్పి మీ కోరిక తీరుస్తానని అన్నారు. మొదటి భార్య లుద్మిలా నుంచి పుతిన్ 2013లో విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్న ఆయన ఇటీవల ఒకప్పటి ఒలంపిక్ జిమ్నాస్టిక్ క్రీడాకారిణి అలినా కాబేవాతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని, వారిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యంతో కూడిన రొమాన్స్ జరుగుతుందని అక్కడి వార్తా పత్రికలు వరుస కథనాలు వెలువరించాయి. కాగా, గురువారం సాయంత్రం పుతిన్ ఓ టీవీకార్యక్రమంలో ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఓ వ్యక్తి పుతిన్ కు ఫోన్ చేసి మీరు రెండో పెళ్లి చేసుకుంటున్నారా? ఆమె ఎవరు అని ప్రశ్నలు సందించారు. దీంతో అవాక్కయిన పుతిన్ అది లైవ్ షో కావడంతో కాస్తంత తడబడినా వెంటనే తేరుకుని తన ప్రైవేటు జీవితం గురించి కన్నా రష్యా అధ్యక్షుడిగా తాను ఎలా పనిచేస్తున్నానన్న విషయంపైనే రష్యా ప్రజలకు ఆసక్తి ఉందని అనుకుంటున్నారని అన్నారు. కానీ, ఏదో ఒక రోజు సమాధానం చెప్పి మీ ఉత్సాహాన్ని తీరుస్తానని చెప్పారు.