హోమియోవిధానం ద్వారా వెన్నునొప్పి నివారణ, చికిత్స
మన శరీరంలో వెన్నెముక నిర్మాణం చాలా విశిష్టంగా, సంక్లిష్టంగా ఉంటుంది. ఒకపక్క అనేక వర్టిబ్రే అనే ఎముకలు ఒకదానితో ఒకటి అనుసంధానితమవుతూనే... మరో పక్క అందులోని ఖాళీలో వెన్నుపామును కప్పి రక్షిస్తుంటాయి. ఆ వెన్నుపాములోంచి అనేక నరాలు మళ్లీ పూర్తి వెన్నెముకగా వర్ణించేదానిలో 32 - 34 చిన్న విడి ఎముకల మధ్య భాగాల్లోంచి బయటికి వస్తూ ఉంటాయి. ఆ నరాలపై ఒత్తిడి పడకుండా ఎముకకూ, ఎముకకూ మధ్య మృదువైన డిస్క్‌లు ఉంటూ వాటిని కాపాడుతుంటాయి.
వీటిలో ఏ భాగాలైనా భౌతిక అరుగుదల వల్లగానీ, ప్రమాదానికి లోనవడం వల్లగానీ అరిగినట్లయితే వెన్నెముకతో పాటు అనేక శరీర భాగాలు అంటే పిరుదులు, తొడలు, పిక్కలు వంటి చోట్ల తీవ్రమైన నొప్పి, మంట, తిమ్మిర్లు కనిపిస్తుంటాయి. వెన్నెముక అమరిక సరిగా లేకపోయినా, లేదా వెన్నుపాము ఉన్నచోట లేకుండా పక్కకు జరిగినా వెన్నునొప్పి వస్తుంది. నాడీ వ్యవస్థకూడా దెబ్బతింటుంది.
వెన్నునొప్పి వచ్చినవారు నరకం అనుభవిస్తారు. ఈ నొప్పి బాధితులు సరిగా కూర్చోలేరు, నిలబడలేరు, పడుకోలేరు, ముందుకు ఒంగలేరు. జీవితాంతం నొప్పి నివారణ మందులు వాడాల్సిందేనా లాంటి వ్యాకులతతో కుంగిపోతారు. సర్జరీతో సమస్య పరిష్కారమవుతుందని కొందరు డాక్టర్లు భరోసా ఇస్తారు. కానీ వెన్నెముకకు సర్జరీ అంటే ప్రతివారూ ఆందోళన చెందుతారు. ఈ తరహా వెన్నునొప్పుల నివారణ, చికిత్సలకు హోమియో వైద్యవిధానం ఒక వరం. ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేకుండా వీటిని తేలిగ్గా తగ్గించవచ్చు.
వెన్నునొప్పికి కారణాలు
వయసుతో పాటు వచ్చే మార్పులు, బరువు పెరగడం, పరిమితికి మించి బరువులు మోయడం, కండరాల బలహీనత, పొగతాగడం, గంటల తరబడి భంగిమ మారకుండా, అపసవ్య భంగిమలో కూర్చోవడం, ఎక్కువసేపు వాహనాలు నడపడం, సరైన పోషకాలు గల ఆహారం తీసుకోకపోవడం, విటమిన్ డి3, బి12, క్యాల్షియం లోపాలు, ఏదైనా ప్రమాదంలో వెన్నుపూసకు దెబ్బ తగలడం, వెన్నెముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పులకు ప్రధాన కారణాలు.
వ్యాధి నిర్ధారణకు అవసరమైన పరీక్షలు
ఎక్స్‌రే ఆఫ్ లంబార్ జాయింట్ సైనోవియల్ ఫ్లుయిడ్ ఎగ్జామినేషన్ ఎమ్మారై / సీటీస్కాన్ రుమటాయిడ్ ఫ్యాక్టర్ హెచ్ఎల్ఏ బి27 రక్త, మూత్ర పరీక్షలు
నివారణ
మంచి పోషకాలతో కూడిన సరైన ఆహారం, మంచి ఆహారపు అలవాట్లు, సరైన నిద్ర, సరైన వ్యాయామంతో పాటు మానసిక సమస్యలైన డిప్రెషన్, ఆందోళన, ఆత్రుత, వ్యాకులత నుంచి దూరంగా ఉండటం.
అస్క్యులస్ హిప్: కూర్చుని ఉండి... నిల్చునేటప్పుడు, ఒంగి లేచేటప్పుడు తీవ్రంగా నొప్పి రావడం, మిగతా సమయాల్లో బలహీనమైన నొప్పి ఉండటం, రక్తనాళాలు ఉబ్బడం, సిరల సమస్యలు ఉన్నవారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
రస్టాక్స్: హోమియో వైద్య విధానంలో వెన్నునొప్పితో రోగి వచ్చినప్పుడు ఏ వైద్యుడైనా ముందుగా ఆలోచించే మందు ఇదే. నడుము నొప్పులు విశ్రాంతి సమయంలో ఎక్కువగా ఉండి, కదిలినప్పుడు/నడిచినప్పుడు తగ్గుతాయి. ఎన్‌వైయూ లాంగ్వా మెడికల్ సెంటర్ వారి పరిశోధనల్లో రస్టాక్స్ మందును ఎలుకలు, మానవులపై ప్రయోగించినప్పుడు కీళ్లవాతం, దీర్ఘకాలిక నడుమునొప్పి తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేసినట్లు గుర్తించారు.
బ్రయోనియా ఆల్బ్: చిన్న కదలికలతో నొప్పి తీవ్రంగా ఉండి, పూర్తి విశ్రాంతితో ఉపశమనం ఉంటుంది. రస్టాక్స్ అనే మందుకు వ్యతిరేక లక్షణాలు ఉంటాయి. వాతావరణ మార్పుల వల్ల సైనోవియమ్, కండరాలు, కీళ్ల మీద ఉండే సిరస్ లేయర్ అరుగుదల ఏర్పడటం వల్ల వెన్నునొప్పి వస్తుంది. చిరాకు, కోపం, విసుగు, అతిదాహం ఉన్న రోగులకు ఇది మంచిది.
కాల్కేరియా ఫ్లోర్: నడుంనొప్పి తీవ్రమైన మంటతో వస్తుంది. రోగికి చలనం, నడవడం విశ్రాంతినిస్తుంది. డిస్క్ కంప్రెషన్, వెన్నుపూసకు దెబ్బతగలడం, డిస్క్‌బల్జ్, విటమిన్ డి3 లోపం, క్యాల్షియమ్ లోపాలతో వచ్చే దీర్ఘకాలిక నడుం నొప్పికి ఈ మందు బాగా పనిచేస్తుంది. రస్టాక్స్ మందు పనిచేయని వారిలో దీన్ని వాడి ఉపశమనం సాధించవచ్చు.
హైపరికం: ప్రమాదాలు (యాక్సిడెంట్స్), కిందపడటం, నరాల మీద ఒత్తిడి పడి నాడీమండలంలో తేడాలు రావడం, నొప్పి నడుము నుంచి కాళ్ల వరకు పాకడం, తిమ్మిర్లు, మంట, అతితీవ్రమైన నొప్పితో రోగి నిలబడటం/కూర్చోవడం కష్టం కావడం, దీర్ఘకా లిక సయాటికా వంటి వాటికి ఇది అద్భుత ఔషధం.
సిమిసిఫ్యూగా: ఇది స్త్రీల సంబంధ నొప్పులకు అద్భుతమైన ఔషధం. రోగి మానసికంగా బలహీనంగా ఉండి, రుతుసమస్యలతో బాధపడుతుంటారు. నెలసరికి ముందు నొప్పి అతిగా వేధిస్తుంది.
కోబాల్టమ్: వృత్తిసంబంధ కారణాలతో దీర్ఘకాలం పాటు కుర్చీలో కూర్చొని ఉండేవారికి (ఉదా:సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, క్లర్కులు, కూర్చుని పనిచేసే వృత్తుల్లో ఉండేవారు, ఊబకాయంతో బాధపడేవారికి ఇది అద్భుతమైన ఔషధం.
చికిత్స
వెన్నునొప్పితో బాధపడేవారికి లక్షణాలను బట్టి ఈ కింది మందులను ఉపయోగిస్తారు. అవి...
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ (తెలంగాణ)