Lunch Agency
-
ఆ భోజనం అధ్వానం
విజయనగరం టౌన్: నగరంలోని బాబామెట్ట ప్రభుత్వ బాలి కోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉందని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు సత్తి అచ్చిరెడ్డి ఆరోపించారు. శనివారం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ మనుషులు తినడానికి పనికిరాని భోజనం ఇక్కడ విద్యార్థులకు పెట్టడం చాలా దారుణమన్నారు. పాచిపోయిన అన్నం, సాంబారు కూరల్లో పురుగులు ఉండటంతో చాలామంది విద్యార్థినులు ఇంటి నుంచే క్యారేజ్ తీసుకుని రావడం కనిపిస్తోందని పేర్కొన్నారు. కస్పా హైస్కూల్లోనూ, వి.టి.అగ్రహారం స్కూల్, జొన్నవలస స్కూల్, నెల్లిమర్ల స్కూళ్లలోనూ ఇదే పరిస్థితి కనబడినట్టు చెప్పారు. నవప్రయాస్ సంస్థ ఇంత ఘోరంగా భోజనం పెడుతున్నా... డీఈఓకు స్కూల్ హెచ్ఎం ఫిర్యాదుచేసినా పట్టించుకోకపోవడం సరికా దన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నవప్రయాస్ సంస్ధపై చర్యలు తీసుకోవాలని, పిల్లలకు శుభ్రమైన ఆహారం అందించాలని కోరారు. స్పందించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసి, విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ సీఆర్పీఎఫ్ పోరాడుతామని తెలిపారు. కార్యక్రమంలో ఫోరం ప్రధాన కార్యదర్శి సింహాద్రిస్వామి, ప్రవీణ్ కుమార్, రాము, కూర్మారావు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. -
భోజనాలు పెట్టి.. అప్పుల పాలై
ఐదు నెలలుగా అందని మధ్యాహ్న భోజన బిల్లులు ఆందోళనలో వంట ఏజెన్సీ మహిళలు చెట్ల కిందే వంటలు పాలకుర్తి : గత 5 నెలలుగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఏజెన్సీ మహిళలకు బిల్లులు చెల్లించకపోవడంతో వంట ఏజెన్సీ మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సరకుల కోసం తమ ఒంటిమీది సొమ్ములమ్మి కట్టామని పలువురు మహిళలు వాపోతున్నారు. ప్రతి నెలా మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించినట్లయితే సౌకర్యంగా ఉంటుందని, బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యమైతే అప్పుల ఊబిలో కూరుకుపోక తప్పదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు వంట గదులు, వంట చేయడానికి అవసరమైన పాత్రలు అన్ని పాఠశాలల్లో లేవు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్ బిల్లులు మరియు వంటగదులు ఏర్పాటుచేయాలని వంట ఏజెన్సీ మహిళలు కోరుతున్నారు. సొమ్ములమ్మీ సరుకులు తెస్తున్నాం బిల్లులు రాక పోవడంతో ఒంటిమీద సొమ్ములమ్మి సరుకులు తెస్తున్నాం. అధికారులు మా బాధలు చూసిబిల్లులు ఇచ్చే ఏర్పాటుచేయాలి. లేకుంటే వంట చేయడం మానెయ్యాల్సి వస్తది. - యాకమ్మ, భోజన నిర్వాహకురాలు, బమ్మెర వారం రోజుల్లో బిల్లులు చెల్లిస్తాం మార్చి నెల వరకు మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాం. అప్పటినుంచి నేటి వరకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదు. మరో వారం రోజుల్లో రెండు నెలల బిల్లులకు ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. వారం రోజుల్లో వంట ఏజెన్సీ మహిళలకు బిల్లులు చెల్లిస్తాం. - పోతుగంటి నర్సయ్య, ఎంఈఓ, పాలకుర్తి -
రెండో రోజూ విద్యార్థుల పస్తులు
♦ నిలిచిన మధ్యాహ్న భోజనం ♦ ఏజెన్సీ, గ్రామ సంఘం సభ్యుల మధ్య తెగని సమస్య ♦ ఇరువురూ కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలన్న అధికారులు దోమ : మధ్యాహ్న భోజనం ఏజెన్సీ మార్పు విషయంలో గ్రామ సంఘం సభ్యులు, వంట ఏజెన్సీ సిబ్బందికి మధ్య తలెత్తిన గొడవ కారణంగా మండల పరిధిలోని మోత్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండో రోజూ గు రువారం మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. వివరాలిలా.. ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే వంట ఏజెన్సీని గ్రామ సంఘం తీర్మానం మేరకు ఏడాదికోసారి మార్చి కొత్తవారిని నియమించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇదే పద్ధతిలో గతే డాది ఆరంభంలో నియమించిన వంట ఏజెన్సీ సిబ్బందిని తొలగించి కొత్త వారిని నియమించడానికి గ్రామ సంఘం ఇటీవల తీర్మానం చేసింది. అయితే గత ఏడాది వంట చేసిన సిబ్బంది గ్రామ సంఘం తీర్మానాన్ని దిక్కరించారు. ఈ సారి కూడా తామే వంట చేస్తామని, ఏజెన్సీని వదులుకునే ది లేదని చెప్పడంతో గొడవ మొదలైంది. గ్రామ సంఘం నిబంధనలకు విరుద్ధంగా గడువు ముగిశాక కూడా ఒకే ఏజెన్సీ సిబ్బంది వంట చేయడానికి వీలు లేదంటూ మహిళా సంఘాల సభ్యులు బుధవారం ఆందోళన నిర్వహించి వంట వండకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం ఉదయం వరకు కూడా అధికారులెవరూ జోక్యం చేసుకోకపోవడంతో సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో గ్రామ సంఘం సభ్యులు మరోసారి పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకుని మధ్యాహ్న భోజనం వండకుండా అడ్డుకున్నారు. మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంతో చాలా మంది విద్యార్థులు గురువారం మధ్యాహ్నమే ఇళ్లకు వెళ్లిపోయారు. విషయం తెలియడంతో జిల్లా ఉప విద్యాధికారి హరిశ్చంద్ర, ఇన్చార్జ్ ఎంపీడీఓ విజయప్ప, తహసీల్దార్ జనార్దన్ తదితర అధికారులు పాఠశాలకు చేరుకుని ఇరు వర్గాల వారితో చర్చలు జరిపారు. విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇరువర్గాలూ ఓ అంగీకారానికి వచ్చి సమస్యను త్వరతగతిన పరిష్కరించుకోవాలని అధికారులు వారికి సూచించారు.