ఐదు నెలలుగా అందని మధ్యాహ్న భోజన బిల్లులు
ఆందోళనలో వంట ఏజెన్సీ మహిళలు చెట్ల కిందే వంటలు
పాలకుర్తి : గత 5 నెలలుగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఏజెన్సీ మహిళలకు బిల్లులు చెల్లించకపోవడంతో వంట ఏజెన్సీ మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సరకుల కోసం తమ ఒంటిమీది సొమ్ములమ్మి కట్టామని పలువురు మహిళలు వాపోతున్నారు. ప్రతి నెలా మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించినట్లయితే సౌకర్యంగా ఉంటుందని, బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యమైతే అప్పుల ఊబిలో కూరుకుపోక తప్పదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు వంట గదులు, వంట చేయడానికి అవసరమైన పాత్రలు అన్ని పాఠశాలల్లో లేవు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్ బిల్లులు మరియు వంటగదులు ఏర్పాటుచేయాలని వంట ఏజెన్సీ మహిళలు కోరుతున్నారు.
సొమ్ములమ్మీ సరుకులు తెస్తున్నాం
బిల్లులు రాక పోవడంతో ఒంటిమీద సొమ్ములమ్మి సరుకులు తెస్తున్నాం. అధికారులు మా బాధలు చూసిబిల్లులు ఇచ్చే ఏర్పాటుచేయాలి. లేకుంటే వంట చేయడం మానెయ్యాల్సి వస్తది. - యాకమ్మ, భోజన నిర్వాహకురాలు, బమ్మెర
వారం రోజుల్లో బిల్లులు చెల్లిస్తాం
మార్చి నెల వరకు మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాం. అప్పటినుంచి నేటి వరకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదు. మరో వారం రోజుల్లో రెండు నెలల బిల్లులకు ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. వారం రోజుల్లో వంట ఏజెన్సీ మహిళలకు బిల్లులు చెల్లిస్తాం. - పోతుగంటి నర్సయ్య, ఎంఈఓ, పాలకుర్తి