భారత్ వైపు.. బ్రాండ్స్ చూపు
♦ వచ్చే ఆర్నెల్లలో 50కి పైగా అంతర్జాతీయ రిటైలర్ల రాక
♦ సుమారు 3,000 పైచిలుకు స్టోర్స్ ప్రారంభం
♦ లిస్టులో పాస్తా మానియా, లష్ అడిక్షన్, కోర్స్ మొదలైనవి
♦ ఫ్రాంచైజీ ఇండియా అంచనాలు
న్యూఢిల్లీ: దేశీయంగా రిటైల్ రంగంలో సంస్కరణల నేపథ్యంలో పలు చిన్న, మధ్యస్థాయి విదేశీ బ్రాండ్లు భారత్‌వైపు చూస్తున్నాయి. రాబోయే ఆరు నెలల్లో సుమారు 53 అంతర్జాతీయ రిటైల్ సంస్థలు భారత మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. దాదాపు 3,000 పైచిలుకు స్టోర్స్ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఆయా సంస్థలతో జట్టు కట్టిన ఫ్రాంచైజీ ఇండియా గణాంకాల ద్వారా ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌లో నియంత్రణ సంస్థలపరమైన అనుమతులు ఇప్పించేందుకు, కార్యకలాపాలు ప్రారంభించడంలోను .. భాగస్వాములను వెతికిపెట్టడంలోనూ వాటికి ఫ్రాంచైజీ ఇండియా సహకారం అందిస్తోంది. ఇండియాలో కాలుమోపేందుకు ఆసక్తిగా ఉన్న సంస్థల్లో కోర్స్, మిగాటో, ఎవిసు, వాల్‌స్ట్రీట్ ఇంగ్లీష్, పాస్తా మానియా, లష్ ఎడిక్షన్, మెల్టంగ్ పాట్, యోగర్ట్ ల్యాబ్, మొనాలిసా తదితర బ్రాండ్స్ ఉన్నాయి.
వీటిలో చాలా మటుకు అమెరికా, సింగపూర్‌కి చెందినవి. ఇవి 300–500 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. వీటిలో 18 ఫుడ్ అండ్ బెవరేజెస్ సంస్థలు కాగా.. అపారెల్, లైఫ్‌స్టయిల్, ఎడ్యుకేషన్ ఉత్పత్తుల సంస్థలు తలో 13 ఉన్నాయి. సుమారు దశాబ్దం కింద పెద్ద రిటైలర్లు, బ్రాండ్స్ భారత్‌లోకి వచ్చాయని, ఇప్పుడు చిన్న, మధ్య స్థాయి బ్రాండ్స్ ప్రవేశించేందుకు ఆసక్తిగా ఉన్నాయని ఫ్రాంచైజీ ఇండియా హోల్డింగ్స్ చైర్మన్ గౌరవ్ మార్యా వెల్లడించారు. ఇవన్నీ విస్తరణకు ఎక్కువగా ఫ్రాంచైజీ విధానంపైనే ఆధారపడుతున్నాయి.
అవకాశాల గని భారత్..
ఏటీ కియర్నీ నివేదిక ప్రకారం రిటైలింగ్‌కు ప్రపంచంలోనే అపార అవకాశాలున్న దేశంగా భారత్ ఇటీవలే చైనాను అధిగమించింది. భారత ప్రభుత్వం విదేశీ రిటైలర్లకు సంబంధించిన నిబంధనలు కూడా సడలించింది. సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సడలించడంతో స్వీడన్‌కి చెందిన హెనెస్ అండ్ మారిట్జ్ (హెచ్అండ్ఎం), ఐకియా, జపాన్ సంస్థ యూనిక్లో, అమెరికాకు చెందిన గ్యాప్ మొదలైన దిగ్గజ బ్రాండ్స్ భారత్‌వైపు దృష్టి సారించాయి. హెచ్అండ్ఎం ఇప్పటికే స్టోర్స్ ప్రారంభించగా.. ఐకియా హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కార్యకలాపాల ప్రారంభానికి జోరుగా కసరత్తు చేస్తోంది.
ఇక కేంద్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తుండటం, వస్తు సేవల పన్నుల విధానాన్ని ప్రవేశపెడుతుండటం మొదలైన చర్యలు కూడా తీసుకుంటోంది. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానుంది. అలాగే ప్రస్తుతం భారత వృద్ధి రేటు కూడా ఆకర్షణీయంగా ఉంది. ఇలాంటి సానుకూల అంశాలన్నీ విదేశీ బ్రాండ్స్‌ను ఆకర్షిస్తున్నాయి. స్వదేశంలో విస్తరణ మందగించి, ఇతర దేశాల మార్కెట్లు అంతంత మాత్రంగానే ఉండటంతో.. చిన్న స్థాయి రిటైల్ సంస్థలు భారత్ వైపు చూస్తున్నాయి. బ్రెజిల్, రష్యా, చైనా మార్కెట్లలో విస్తరణ పూర్తయిపోవడం.. యూరప్, మధ్యప్రాచ్య దేశాల మార్కెట్లలో వృద్ధికి అవకాశాలు తగ్గిపోవడంతో భారత్ వైపు మళ్లుతున్నట్లు పిల్లల దుస్తులు విక్రయించే యూరోపియన్ సంస్థ మొనాలిసా వర్గాలు పేర్కొన్నాయి.
చిన్న బ్రాండ్స్.. చిన్న పట్టణాలపై దృష్టి..
దిగ్గజ సంస్థలు పెద్ద నగరాలు, పట్టణాలే లక్ష్యంగా కార్యకలాపాలు ప్రారంభిస్తుంటాయి. వాటికి భిన్నంగా ఈ చిన్న బ్రాండ్స్.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో అవకాశాలపై మొనాలిసా వంటి సంస్థలు దృష్టిపెట్టాయి. ఇక నాన్ వెజ్ విషయంలో భారత్‌లో ప్రధానంగా చికెన్ ఉత్పత్తులకుండే డిమాండ్‌ను అవకాశంగా మల్చుకోవాలని బ్రిటన్‌కి చెందిన క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (క్యూఎస్ఆర్) సదరన్ ఫ్రైడ్ చికెన్ యోచిస్తోంది. చికెన్ ప్రధానమైన తమ మెనూ ఇక్కడ బాగా ఆదరణ పొందగలదని భావిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. సదరన్ ఫ్రైడ్ చికెన్ అంతర్జాతీయంగా 700 పైచిలుకు ఫ్రాంచైజీలు నిర్వహిస్తోంది.
ఫుడ్ చెయిన్స్ జోరు ..
దేశీ రిటైల్ మార్కెట్ పరిమాణం 2016లో సుమారు 641 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏటా 10% వృద్ధి రేటుతో ఇది 2026 నాటికి 1.6 ట్రిలియన్ డాలర్లకి చేరొచ్చని అంచనా. ఇంత భారీ మార్కెట్లో ఆహారం, నిత్యావసరాల రిటైల్ వ్యాపారం కేవలం 3 శాతమే. దీంతో అవకాశాలు అందిపుచ్చుకోవాలని అంతర్జాతీయ ఫుడ్ చెయిన్స్ భావిస్తున్నాయి. డామినోస్ పిజ్జా, మెక్‌డొనాల్డ్స్ ఆధిపత్యం నడుస్తున్న మార్కెట్లోకి 18 క్విక్ సర్వీస్ రెస్టారెంట్ చెయిన్స్ ప్రవేశించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇవన్నీ కూడా స్నాక్స్, ఐస్ క్రీమ్ బ్రాండ్సే.