LYF smartphones
-
ప్రత్యర్థుల గట్టిపోటీ: రిలయన్స్ ఢమాల్
న్యూఢిల్లీ : రిలయన్స్ ... ఇటు జియోతో టెలికాం మార్కెట్ లో సంచలనాలు సృష్టించడమే కాకుండా.. ఎల్వైఎఫ్ డివైజ్ లతో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోనూ టాప్-5లో ఒకటిగా తన చక్రం తిప్పింది. సూపర్ హిట్ తో లాంచ్ అయిన రిలయన్స్ రిటైల్ ఎల్వైఎఫ్ డివైజ్ ల ప్రస్తుత పరిస్థితి దారుణంగా మారుతోంది. గతేడాది ఎంత వేగంగా అయితే దూసుకెళ్లాయో అంతే వేగంతో ఈ ఏడాది తమ మార్కెట్ షేరును కోల్పోయాయి. 4జీ ఫోన్ల ప్రత్యర్థులు చైనీస్ కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకోలేక ప్రస్తుతం రిలయన్స్ మార్కెట్ షేరును కోల్పోతున్నట్టు తెలుస్తోంది. గతేడాది ఇదేకాలంలో 7 శాతం ఎక్కువ నమోదైన రిలయన్స్ ఎల్వైఎఫ్ మార్కెట్ షేరు, 2017 మార్చితో ముగిసిన క్వార్టర్ లో 3 శాతం కిందకి పడిపోయినట్టు అనాలిస్టులు అంచనావేస్తున్నారు. ఈ ఫోన్ల సరుకు రవాణా కూడా తగ్గిపోయినట్టు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్, సైబర్ మీడియా రీసెర్చ్ చెబుతోంది. రిలయన్స్ జియో తిరుగులేకుండా దూసుకెళ్తున్న క్రమంలో 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ-ఎనాబుల్ స్మార్ట్ ఫోన్లను ఎల్వైఎఫ్ బ్రాండులో ఈ కంపెనీ ప్రవేశపెట్టింది. జియో ప్రీవ్యూ ఆఫర్ కూడా తొలుత వీటికే ఆఫర్ చేయడంతో, భారీగా డిమాండ్ ఏర్పడి, భారీ ఎత్తున్న సరుకు రవాణా జరిగినట్టు తెలిసింది. 2016లో రిలయన్స్ జియో ప్రీవ్యూ ఆఫర్ కేవలం ఎల్వైఎఫ్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లకు మాత్రమే ఇచ్చారని, కానీ ప్రస్తుతం జియో అన్ని స్మార్ట్ ఫోన్ బ్రాండులకు భాగస్వామిగా వ్యవహరిస్తుందని కౌంటర్ పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ అనాలిస్టు శోభిత్ శ్రీవాత్సవ చెప్పారు. అంతేకాక ప్రస్తుతం అందరూ ప్లేయర్స్ 4జీ ఫోన్లను ఆఫర్ చేయనప్పటికీ, వారి పోర్టుఫోలియోలో ఇది ఒకభాగమైందని ఐడీసీ ఇండియా సీనియర్ అనాలిస్టు నవ్కేందర్ సింగ్ పేర్కొన్నారు. అయితే పడిపోతున్న తమ స్మార్ట్ ఫోన్ మార్కెట్ షేరుపై స్పందించడానికి రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోలు నిరాకరించాయి. రూ.2,999 నుంచి రూ.30,000 ధరల మధ్యలో రిలయన్స్ 4జీ డివైజ్ లను గతేడాది తీసుకొచ్చింది. 2016లో 7.6 మిలియన్ స్మార్ట్ ఫోన్ల సరుకు రవాణా జరిగింది. ప్రస్తుతం రూ.999 నుంచి రూ.1,500 మధ్యలో 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసేందుకు జియో సన్నాహాలు చేస్తోంది. -
ఆ ఫోన్ల ధరలు ఢమాల్..!
లైఫ్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ల ధరలు పడిపోయాయి. లైఫ్ బ్రాండెడ్ ఫోన్ల ధరలు తగ్గిస్తున్నట్టు రిలయెన్స్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మంగళవారం నుంచి ఈ కొత్త ధరలు అమలు చేయాలని డీలర్లకు రిలయెన్స్ కంపెనీ తెలిపింది. లైఫ్ స్మార్ట్ ఫోన్ల కొత్త ధరలు... లైఫ్ వాటర్ 2.. కొత్త ధర రూ.9,499 (రూ.4వేల తగ్గింపు) లైఫ్ విండ్ 6.... కొత్త ధర రూ.5,999 (రూ.500 తగ్గింపు) లైఫ్ ఫ్లేమ్ 2.... కొత్త ధర రూ. 3,499 (రూ. 1,300 తగ్గింపు) లైఫ్ ఫ్లేమ్ 4, ఫ్లే 5, ఫ్లే 6 హ్యాండ్ సెట్లపై కూడా రూ.1,000 ధర తగ్గించింది. దీంతో ఈ మూడు ఫోన్లు రూ.2,999కే మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు అన్ని లైఫ్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లకు రిలయెన్స్ జియో నెట్ వర్క్ పై మూడు నెలల పాటు ఫ్రీ అన్ లిమిటెడ్ 4జీ డేటా, వాయిస్ కాలింగ్ ఆఫర్ చేయనున్నట్టు రిలయెన్స్ ప్రకటించింది. దీంతో రూ.2,999కే మూడు నెలల వాయిస్ కాలింగ్, అన్ లిమిడెట్ 4జీ డేటాను వినియోగదారులు పొందబోతున్నట్టు కంపెనీ తెలిపింది. అయితే రిలయెన్స్ జియో 4జీ సర్వీసులు అధికారికంగా ఇంకా ఆవిష్కరించలేదు. కేవలం ఉద్యోగుల రిఫరల్ ప్రోగ్రామ్ కింద ఈ సర్వీసులను వినియోగదారులకు కంపెనీ ఆఫర్ చేస్తోంది. రిలయెన్స్ సీడీఎమ్ఏ కస్టమర్లు రిలయెన్స్ జియో సిమ్ లపై అప్ గ్రేడ్ అయ్యేలా కంపెనీ ఆఫర్ చేస్తోంది. లైఫ్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసిన వినియోగదారులందరికీ జియో సిమ్ లను కంపెనీ అందుబాటులో ఉంచుతోంది.