Lyme disease
-
సింగర్ జస్టిన్ బీబర్‌కు లైమ్ వ్యాధి
తన పాటలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న హాలీవుడ్ సింగర్ జస్టిన్ బీబర్. కెనడాకు చెందిన ఈ పాప్ సింగర్ ప్రస్తుతం ఓ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతనే బుధవారం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనకు లైమ్ వ్యాధి సోకిందని, అయితే దీనికి చికిత్స తీసుకుంటున్నానని ఆయన తెలిపారు. పాతికేళ్లు వయసున్న జస్టిన్ బీబర్ ఇన్‌స్టాలో ఇలా రాసుకొచ్చారు. ‘చాలా మందికి తెలియదు. జస్టిన్ బీబర్ ఎందుకు ఇలా తయారయ్యాడని అందరూ అనుకుంటున్నారు. నేను లైమ్ వ్యాధితో బాధపడుతున్నానని వారికి తెలీదు. ఇది నాపై దీర్ఘకాలంగా ప్రభావం చూపింది. ఈ వ్యాధి వల్ల నా చర్మం పూర్తిగా పాడైపోయింది. మెదడు పనితీరు మారింది. ఒంట్లో శక్తి తగ్గి, ఆరోగ్యం క్షీణించిపోయింది’ అని పేర్కొన్నారు. అయితే చాలా కాలం ఈ జబ్బుతో పోరాడం చేశానని ప్రస్తుతం దీనిని పూర్తిగా అధిగమించడానికి సరైన చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. కాగా లైమ్ వ్యాధి బొర్రెలియా బర్గ్ డార్ఫరి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇక్సోడ్స్ అనే పేను లాంటి పురుగుల (టిక్స్) ద్వారా వ్యాపిస్తుంది. అమెరికా వంటి దేశాల్లో ఎండకాలంలో బాగా వచ్చే ఈ వ్యాధి సోకడం వల్ల చర్మం ఎర్రగా మారి.. దద్దుర్లు ఏర్పడతాయి. అలాగే కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. ఇక ఓ నివేదిక ప్రకారం సుమారు మూడు లక్షల మంది అమెరికన్లు లైమ్ వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. -
మరో భారాన్ని భుజానికెత్తుకున్న కమల్
చెన్నై: సాహసం, వైవిద్యం, విభిన్నత వంటి అంశాలే పరమావధిగా ఎప్పటికప్పుడు తనను నిత్యనూతనంగా పరిచయం చేసుకునే విలక్షణ ప్రముఖ నటుడు కమల్ హాసన్ మరోసాహసానికి దిగాడు. తన చిత్రానికే తానే దర్శకత్వం వహించుకునే బాధ్యతలు భుజాన వేసుకున్నారు. తన చిత్ర దర్శకుడు అస్వస్థతకు గురవ్వడంతో ఆయన ఈ పని చేస్తున్నారు. కమల్ తాజాగా నటిస్తున్న చిత్రం శబాష్ నాయుడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, అనూహ్యంగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సి ఉంది. అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తి చేసి సినిమా ప్రేక్షకులముందుకు తీసుకురావాల్సిన నేపథ్యంలో ఇప్పటికే దర్శకత్వంలో పట్టున్న కమల్.. ఈ చిత్రానికి ఎలాంటి అవాంతరం కలగకుండా ఉండేందుకు దర్శకత్వ బాధ్యతలు భుజాన వేసుకున్నారు. 'మా దర్శకుడు రాజీవ్ బాగా అస్వస్థతతో ఉన్నారు. లాస్ ఎంజెల్స్‌లో మేం షూటింగ్ జరుపుకుంటున్న నాలుగో రోజు ఇలా జరగడం దురదృష్టం. ఆయన లైమ్ డిసీజ్‌కు లోనయ్యారు. ఉత్తర అమెరికా, యూరప్ లో మాత్రమే వచ్చే అత్యంత అరుదైన వ్యాధి ఇది. అందుకే నేను నా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను' అని కమల్ సోమవారం ఒక ప్రకటనలో చెప్పారు. అలాగే లాస్ ఎంజెల్స్ లోని ప్రముఖ ఆస్పత్రిలో తమ డైరెక్టర్ వైద్య చికిత్స పొందుతున్నారని చెప్పారు.