4 గంటల పాటు ఏకధాటిగా నృత్యం..
కొణిజర్ల: ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన తూము సాయి స్నేహిత కూచిపూడి నృత్యంలో కొత్త రికార్డును సృష్టించింది. స్థానికంగా ఏడో తరగతి చదువుతున్న పదకొండేళ్ల విద్యార్థిని 4 గంటల 8 నిమిషాల 4 సెకండ్లపాటు ఏకధాటిగా నృత్యం చేసి.. విజయవాడకు చెందిన ఎం.చంద్రిక రికార్డును తిరగరాసింది. కొణిజర్ల మండలం తనికెళ్లలోని లక్ష్య ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన నృత్య ప్రదర్శనను వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి ఏ.ప్రసాద్, జీనియస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి ఏఆర్.స్వామి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి తిలకించి.. రికార్డులు నమోదు చేశారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత బాలికకు రికార్డును ప్రదానం చేశారు. స్నేహిత, ఆమె గురువు కొండలరావును సన్మానించారు.