కథలు వాస్తవికతకు దర్పం పట్టాలి
కోవెలకుంట్ల:
వాస్తవికతకు దర్పం పట్టేలా కథలు సాగాలని రాయలసీమ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఎం. జయరాజ్ చెప్పారు. రాయలసీమ కథకులు- సామాజిక అధ్యయనం అన్న అంశంపై పట్టణంలోని వాసవీ బొమ్మిడాల డిగ్రీ కళాశాలలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ నాదం శశికళ అధ్యక్షతన జాతీయ సదస్సు నిర్వహించారు. రెండురోజులుగా జరుగుతున్న ఈ సదస్సు శుక్రవారంతో ముగిసింది. చివరిరోజున సదస్సుకు రిజిస్ట్రార్, కథ రచయిత హరికిషన్ ముఖ్య అతిథులుగా హాజరుకాగా తెలంగాణా, కుప్పం, యోగివేమన, రాయలసీమ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, కవులు, రచయితలు రాయలసీమ కథకులు- సామాజిక అధ్యయనం అంశంపై పత్ర సమర్పన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రిజస్ట్రార్ మాట్లాడుతూ కథల ప్రభావం సమాజంపై చూపుతుందన్నారు. అయితే, వాస్తవికతకు దగ్గరగా సమస్యల పరిష్కార మార్గంగా కథలు సాగాలని సూచించారు. గతంలో జాతీయ సదస్సులు విశ్వవిద్యాలయ, జిల్లా కేంద్రాల్లో నిర్వహించేవారన్నారు. ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో నిర్వహించినా విజయవంతమవుతున్నాయని పేర్కొన్నారు. కోవెలకుంట్లలో జాతీయ సదస్సు నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. కథ రచయిత హరికిషన్ మాట్లాడుతూ కరువుల చరిత్ర రాయలసీమదని, 1990కి ముందు ప్రతి ఐదేళ్లకోసారి రాయలసీమలో కరువు వచ్చేదని, ప్రస్తుతం మూడేళ్లకొకసారి పలకరిస్తోందన్నారు. సీమలో వ్యవసాయం జూదంగా మారిందన్నారు. ఈప్రాంతాన్ని ఆదుకునేదిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మల్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సదస్సు కన్వీనర్ బావికాటి రాఘవేంద్ర, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గంగన్న, అధ్యాపకులు, వ క్తలు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.