M. pallam raju
-
ఇక 'మూడు' తోనే సరిపెట్టుకుందాం!
రాజమండ్రి: దేశవ్యాప్తంగా ఘోర ఓటమిని చవిచూసినా కాంగ్రెస్ పార్టీ.. ఆంధ్రప్రదేశ్ లో అంతకంటే ఎక్కువ స్థాయిలో చతికిలబడింది. అటు ఉత్తరాది రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ ప్రభంజనానికి తుడిచిపెట్టుకుని పోయిన కాంగ్రెస్.. ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తీవ్రంగా నష్టపోయింది. 2009లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో 33 లోక్ సభ సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు రెండు సీట్లను మాత్రమే గెలుచుకుని తీవ్ర వైఫల్యానికి గురైయ్యింది. అది కూడా ప్రస్తుతం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే. సీమాంధ్రలో అయితే ఇక ఆ పార్టీ ఊసే లేకుండా పోయింది. మహామహులు సైతం మట్టికరిచిన సీమాంధ్ర అభ్యర్థుల జాబితాలో పల్లంరాజుకు కూడా చేరిపోయారు. కాకినాడ లోక్ సభ నుంచి 1989, 2004, 2009లో మూడు సార్లు గెలిచిన పల్లంరాజు.. ఈసారి మాత్రం ఎటువంటి ప్రభావాన్ని చూపకపోవడమే కాకుండా ఘోరంగా ఓడిపోయారు. ఆయనకు ప్రజలు ఓట్లతో సమాధానం చెప్పిన తీరును చూస్తే మాత్రం విస్మయం కలుగక మానదు. ఇక్కడ నుంచి తాజాగా లోక్ సభకు ఎన్నికైనా తోట నర్సింహకు 5, 14,402 ఓట్లు వస్తే.. తన సమీప వైఎస్సార్ సీపీ ప్రత్యర్థి చలంశెట్టి సునీల్ కు 5,10, 972 ఓట్లు పోలైయ్యాయి. వీరిద్దరూ హోరాహోరీగా తలపడినా, సీనియర్ మాజీ మంత్రి పల్లంరాజుకు మాత్రం కేవలం 19, 754 ఓట్లు వచ్చాయి. కనీసం 10,000 దాటలేకపోయినా నేతలతో పోల్చుకుంటే ఇది కాస్త ఫర్వాలేదు అనుకోక తప్పదు. స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ పీసీసీ చీఫ్ పల్లంరాజు మనవడే ఈ పల్లంరాజు. ఆయన తండ్రి ఎం. శ్రీరామ్ సంజీవ రావు మూడు సార్లు లోక్ సభకు ఎన్నికైయ్యారు. 1982-84లో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. అంతకుముందు 1970లో పల్లంరాజు తండ్రి రాంచంద్రాపురం అసెంబ్లీ నుంచి ఎన్నికైయ్యారు. ఇటు వంటి రాజకీయ పునాది బలంగా ఉన్న పల్లంరాజుకు ఈసారి మూడో స్థానంతో సరిపెట్టుకోవడం మాత్రం ఆయన వర్గీయులకు మింగుడుపడటం లేదు. -
ఆస్తులు వెల్లడించని పల్లంరాజు, పురందేశ్వరి
న్యూఢిల్లీ: గడువు ముగిసి నెలరోజులు దాటిపోయినా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఎం.ఎం.పల్లంరాజు, డి.పురందేశ్వరి తమ ఆస్తుల వివరాలను ప్రకటించలేదు. మంత్రులకు సంబంధించిన నియమావళి మేరకు కేంద్ర మంత్రులైతే ప్రధానమంత్రికి, రాష్ట్ర మంత్రులైతే ముఖ్యమంత్రికి ఏటా తమ ఆస్తులు, అప్పుల వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన గడువు గత ఆగస్టు 31తో ముగిసిపోయింది. అయినా మంగళవారం వరకు మొత్తం 77 మంది కేంద్ర మంత్రుల్లో 42 మంది తమ ఆస్తులు, అప్పులకు సంబంధించిన వార్షిక వివరాలను ప్రధానికి అందజేయడంలో విఫలమయ్యారు. 32 మంది కేబినెట్ మంత్రుల్లో పల్లంరాజు సహా 18 మంది, 12 మంది స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రుల్లో ఏడుగురు, 33 మంది సహాయ మంత్రుల్లో పురందేశ్వరి సహా 17 మంది తమ ఆస్తుల వివరాలను దాఖలు చేయలేదు. కేబినెట్ మంత్రులు గులాం నబీ ఆజాద్, అజిత్ సింగ్, క పిల్ సిబల్, శ్రీప్రకాశ్ జైశ్వాల్, సహాయ మంత్రులు శశిథరూర్, ఆర్పీఎన్ సింగ్ తదితరులు తమ ఆస్తుల వివరాలు ప్రకటించలేదు. అయితే ఎ.కె.ఆంటోనీ, పి.చిదంబరం, శరద్‌పవార్, సుశీల్‌కుమార్ షిండే, వీరప్పమొయిలీతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు ఈ వివరాలను వెల్లడించారు.