ఇక 'మూడు' తోనే సరిపెట్టుకుందాం!
రాజమండ్రి: దేశవ్యాప్తంగా ఘోర ఓటమిని చవిచూసినా కాంగ్రెస్ పార్టీ.. ఆంధ్రప్రదేశ్ లో అంతకంటే ఎక్కువ స్థాయిలో చతికిలబడింది. అటు ఉత్తరాది రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ ప్రభంజనానికి తుడిచిపెట్టుకుని పోయిన కాంగ్రెస్.. ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తీవ్రంగా నష్టపోయింది. 2009లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో 33 లోక్ సభ సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు రెండు సీట్లను మాత్రమే గెలుచుకుని తీవ్ర వైఫల్యానికి గురైయ్యింది. అది కూడా ప్రస్తుతం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే. సీమాంధ్రలో అయితే ఇక ఆ పార్టీ ఊసే లేకుండా పోయింది. మహామహులు సైతం మట్టికరిచిన సీమాంధ్ర అభ్యర్థుల జాబితాలో పల్లంరాజుకు కూడా చేరిపోయారు.
కాకినాడ లోక్ సభ నుంచి 1989, 2004, 2009లో మూడు సార్లు గెలిచిన పల్లంరాజు.. ఈసారి మాత్రం ఎటువంటి ప్రభావాన్ని చూపకపోవడమే కాకుండా ఘోరంగా ఓడిపోయారు. ఆయనకు ప్రజలు ఓట్లతో సమాధానం చెప్పిన తీరును చూస్తే మాత్రం విస్మయం కలుగక మానదు. ఇక్కడ నుంచి తాజాగా లోక్ సభకు ఎన్నికైనా తోట నర్సింహకు 5, 14,402 ఓట్లు వస్తే.. తన సమీప వైఎస్సార్ సీపీ ప్రత్యర్థి చలంశెట్టి సునీల్ కు 5,10, 972 ఓట్లు పోలైయ్యాయి. వీరిద్దరూ హోరాహోరీగా తలపడినా, సీనియర్ మాజీ మంత్రి పల్లంరాజుకు మాత్రం కేవలం 19, 754 ఓట్లు వచ్చాయి. కనీసం 10,000 దాటలేకపోయినా నేతలతో పోల్చుకుంటే ఇది కాస్త ఫర్వాలేదు అనుకోక తప్పదు.
స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ పీసీసీ చీఫ్ పల్లంరాజు మనవడే ఈ పల్లంరాజు. ఆయన తండ్రి ఎం. శ్రీరామ్ సంజీవ రావు మూడు సార్లు లోక్ సభకు ఎన్నికైయ్యారు. 1982-84లో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. అంతకుముందు 1970లో పల్లంరాజు తండ్రి రాంచంద్రాపురం అసెంబ్లీ నుంచి ఎన్నికైయ్యారు. ఇటు వంటి రాజకీయ పునాది బలంగా ఉన్న పల్లంరాజుకు ఈసారి మూడో స్థానంతో సరిపెట్టుకోవడం మాత్రం ఆయన వర్గీయులకు మింగుడుపడటం లేదు.