పేదల కోసమే... జనధన యోజన
ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఖాతా
ఇంటిల్లిపాదికీ రూ. లక్ష ప్రమాదబీమా
కలెక్టర్ రఘునందన్‌రావు
విజయవాడ : ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతాను ప్రారంభించే విధంగా ప్రధానమంత్రి జనధన యోజనను పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఎం రఘునందన్‌రావు సూచించారు. జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆధ్వర్యంలో గురువారం సబ్- కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రధానమంత్రి జనధన యోజనను లాంఛనంగా ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా తెరిచేవిధంగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి జన ధన యోజనను ప్రవేశపెట్టారని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 60 వేల బ్యాంకు ఖాతాలు తెరిచే లక్ష్యానికిగానూ 75 వేలకు పైగా ప్రారంభించడం అభినందనీయమన్నారు. గతంలో బ్యాంకింగ్ లావాదేవీలు ధనికులకు మాత్రమే పరిమితమయ్యేవని, ప్రస్తుత ఆర్థిక విధానంలో పేదవారికీ బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో సైతం సంపూర్ణ ఆర్థిక చేకూర్పులో భాగస్వాములయ్యే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఖాతాదారునికి వారు జమచేసిన మొత్తానికి వడ్డీ అందుతుందని, లక్ష రూపాయల వరకు ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందన్నారు. జాయింట్ కలెక్టర్ జె.మురళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉన్నట్లుగానే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా అవసరమన్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో అన్ని రకాల లావాదేవీలు బ్యాంకుల ద్వారానే నిర్వహిస్తారన్నారు. సామాన్య ప్రజలు నగదును తమవద్ద ఉంచుకోకుండా బ్యాంకు ఖాతాలో దాచుకోవడం వల్ల భద్రత ఏర్పడుతుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి అన్నారు. ఇండియన్ బ్యాంక్ డీజీఎం, లీడ్ బ్యాంక్ కన్వీనర్ ఎంఆర్ రఘునాథరావు మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో ప్రతి ఇంటిలో రెండు బ్యాంకు ఖాతాలు తెరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోడి, రాజమండ్రి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ప్రధానమంత్రి జనధన యోజన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే బిజినెస్ కరస్పాండెంట్లు గ్రామాల్లో బ్యాంకింగ్ సౌకర్యాలను ఏ విధంగా నిర్వహిస్తారో డెమో ద్వారా వివరించారు.
ఖాతాలను తెరచిన ఖాతాదారులకు బ్యాంకు పాసు పుస్తకాలను కలెక్టర్, జేసీ, బ్యాంకు అధికారులు అందజేశారు. లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ ఆర్వి.నరసింహారావు, నాబార్డు ఏజీఎం మధుమూర్తి, బ్యాంక్ కంట్రోలింగ్ ఆఫీసర్లు, బ్యాంకింగ్, బీమా, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.