పర్యావరణ ప్రమాణాలు కాపాడాలి
ముత్తుకూరు : తీరప్రాంతంలోని థర్మల్ విద్యుత ప్రాజెక్టులు పర్యావరణ ప్రమాణాలు పాటించడం ద్వారా ప్రజలు, జీవరాసులు జీవించే హక్కు కాపాడాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, జడ్జి ఎం.రామకృష్ణ అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మునుకూరు రామచంద్రారెడ్డి, సీనియర్ న్యాయవాదులతో కలసి ఆదివారం నేలటూరులోని ఏపీజెన్కో విద్యుత్ ప్రాజెక్టు, దాని యాష్పాండ్, పైనాపురంలోని టీపీసీఐఎల్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను పరిశీలించారు.
అనంతరం ముసునూరువారిపాళెంలో మునుకూరు జనార్దనరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. వ్యర్థ జలాలు విడుదల చేసి జలవనరులు పాడైపోకుండా చూడాలన్నారు. కాలుష్యం వ్యాపించకుండా పెద్ద ఎత్తున మొక్కలు పెంచాలన్నారు. భూములుకోల్పోయిన రైతు కుటుంబాలకు సకాలంలో పరిహారం ఇవ్వడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. 20 ఏళ్ల క్రితం సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం కోర్టులో ఉందన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చొరవ తీసుకుని, బాధిత రైతులకు వెంటనే పరిహారం దక్కేలా కృషి చేయాలన్నా రు. తమ పరిధిలో రైతు కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
టీపీసీఐఎల్ యాష్పాండ్ చూపనేలేదు
టీపీసీఐల్ పవర్ ప్రాజెక్టు నిర్వాహకులు తమకు యాష్పాండ్ చూపించనేలేదని సీనియర్ న్యాయవాది వేనాటి చంద్రశేఖర్రెడ్డి ఈ సమావేశంలో మం డిపడ్డారు. గ్రామాల సమీపంలో ఉన్న జెన్కో యాష్పాండ్ను మరోచోట మార్చాలని డిమాండ్ చేశారు. మొక్కల పెంపకం సక్రమంగా లేదన్నారు. ఉద్యోగాల కల్పనలో స్థానికులకు అవకాశం కల్పిస్తూ, రిజర్వేషన్లు పాటించాలని ప్రాజెక్టుల నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తరచూ ప్రాజెక్టుల్లో కాలుష్యం వ్యాపించకుండా తనిఖీలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎన్.శ్రీనివాసులురెడ్డి, అబ్బయ్యరెడ్డి, రామిరెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, బార్ అసోసియేషన్ సభ్యులు, మాజీ సర్పంచ్ ఈపూరు శేషారెడ్డి పాల్గొన్నారు.