13వ రోజు.. 13వ మృతదేహం లభ్యం
హైదరాబాద్‌కు చెందిన సాయిరాజుగా గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో శుక్రవారం మరో విద్యార్థి మృతదేహం బయటపడింది. మృతుడిని హైదరాబాద్‌లోని ఏఎస్రావునగర్కు చెందిన ఎం.సాయిరాజుగా గుర్తించారు. బియాస్ నదిలో పెను ప్రమాదం చోటుచేసుకొని శుక్రవారం నాటికి 13 రోజులయ్యాయి. శుక్రవారం ఎప్పట్లాగే ఆర్మీ, నేవీ, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్తో పాటు రాష్ట్రానికి చెందిన పోలీసు గజ ఈతగాళ్లతో కూడిన ఆరు వందల మంది నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా 11 మంది విద్యార్థులు, ఒక ఫ్యాకల్టీ ఆచూకీ దొరకాల్సి ఉంది. సాయిరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌కు తరలించామని, శనివారం ఉదయం విమానంలో హైదరాబాద్‌కు తరలిస్తామని ప్రభుత్వం తరపున సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.