ముంగిలి
టూకీగా ప్రపంచ చరిత్ర 2
రచన: ఎం.వి.రమణారెడ్డి
సూర్య మండలంలో ఉండే తొమ్మిది గ్రహాలూ సూర్యబింబం నుండి తెగిపడి దూరంగా విసరబడ్డ ముక్కలేనని ఒక సిద్ధాంతం. వేగం మీద తెగిపడ్డాయి కాబట్టి అవి అదే వేగంతో సూర్యుని చుట్టూనూ తిరుగుతుంటాయి, సూర్యునిలాగే ఆత్మపరిభ్రమణంలోనూ ఉంటాయి.
భూమి ఆకారం, హోదాల మీద బలమైన వాదోపవాదాలు మనదేశంలో జరిగిన దాఖలాలు లేవుగానీ, యూరప్ ఖండాన్ని ఆ చర్చ తీవ్రమైన సంక్షోభంలోకి నడిపించింది. శాస్త్రీయ విజ్ఞానం ఫలితంగా మతం పునాదులు కదలడంతో బైబిలుకు భిన్నంగా వాదించేవాళ్ళను ‘దైవద్రోహులు’ గానో, ‘మతిభ్రష్టులు’గానో ప్రకటించి క్రిస్టియన్ పీఠాధిపతులు వాళ్ళను క్రూరంగా హింసించారు. గ్రహాలన్నిటికీ సూర్యుడు కేంద్రమనీ, భూమితోపాటు ఇతర గ్రహాలన్నీ సూర్యునిచుట్టూ తిరుగుతున్నాయని మొట్టమొదటిసారి సహేతుకంగా ప్రతిపాదించిన కోపర్నికస్ అనే శాస్త్రజ్ఞుణ్ణి క్రిస్టియన్ శ్మశానంలో పూడ్చేందుకు అనుమతి నిరాకరించారు. కోపర్నికస్ను సమర్థించిన బ్రూనోను సజీవదహనం చేశారు. దూరదర్శినిని కనుగొన్న గెలీలియోను ‘హౌస్ అరెస్టు’కు గురిచేశారు.
మతవిశ్వాసాలకూ శాస్త్రవిజ్ఞానానికీ వందలాది సంవత్సరాలు జరిగిన పోరాటంలో చివరకు విజ్ఞానమే విజయం సాధించింది. ఆధునిక ఖగోళశాస్త్రం రీత్యా భూమి సూర్యకుటుంబానికి చెందిన గ్రహాల్లో ఒకటి; ఆ కుటుంబానికి కేంద్రం సూర్యుడు. అనంతవిశ్వంలో విస్తరించిన కోట్లాది నక్షత్రాల్లో సూర్యగోళం కూడా ఒక నక్షత్రం. కాకపోతే, అది మిగతా నక్షత్రాలకంటే మనకు చేరువలో ఉన్నందున, మొనలు మొనలుగా కాకుండా, స్పష్టమైన వృత్తంగా కనిపిస్తుంది. చేరువగా అంటే అదేదో అమెరికా వెళ్ళేందుకో జపాన్ వెళ్ళేందుకో ప్రయాణం చేసే దూరంతో పోల్చుకునేంత చిన్నదిగాదు - కొంచెం ఇటూఅటుగా పదికోట్ల మైళ్ళు! దాని వ్యాసం 8,66,000 మైళ్లు; పరిమాణంలో భూమికంటే పన్నెండున్నర లక్షల రెట్లు పెద్దది. భూమి వ్యాసం సగటున 7895 మైళ్ళు.
మిగతా నక్షత్రాలకు మల్లే సూర్యగోళం ఒక నిప్పుల ముద్ద. ఊహించేందుకు వీలుగానంత వేడితో, వెలుతురుతో, నాలుకలు చాచే మంటలతో, తన చుట్టూ తాను విపరీతమైన వేగంతో తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగే దురుసుతనంలో ఎప్పుడో తెగిపోయిన ఒకానొక నాలుక మన భూగోళం. సూర్య మండలంలో ఉండే తొమ్మిది గ్రహాలూ (ఇటీవల మరొకటి అదనంగా ఉన్నట్టు అనుమానం) అలా సూర్యబింబం నుండి తెగిపడి దూరంగా విసరబడ్డ ముక్కలేనని ఒక సిద్ధాంతం. వేగం మీద తెగిపడ్డాయి కాబట్టి అవి అదే వేగంతో సూర్యుని చుట్టూనూ తిరుగుతుంటాయి, సూర్యునిలాగే ఆత్మపరిభ్రమణంలోనూ ఉంటాయి. కాలక్రమంలో సూర్యునికి దూరందూరం జరగడంతో వాటికి వేడీ తగ్గింది. పరిభ్రమణ వేగమూ తగ్గింది. అన్నిటికంటే ముందు పుట్టి, అన్నికంటే దూరం జరిగిన గ్రహం ‘ఫ్లూటో’. పూర్తిగా చల్లబడి, అతి మెల్లగా తిరిగే గ్రహం కావడంతో దీన్ని ‘మృతగ్రహం’ (డెడ్ ప్లానెట్) గా వ్యవహరిస్తారు. సూర్యకిరణాల తేజస్సుకు అందనంత దూరం జరగడంతో దీన్ని ‘చీకటిగ్రహం’ అనిగూడా అంటారు.
తొమ్మిది తోబుట్టువుల్లో మిక్కిలి పిన్నవయసుది బుధగ్రహం. ఇది సూర్యునికి అత్యంత సమీపంలో ఉండడమేగాక, మిగతావాటికంటే వేగంగా సూర్యుని చుట్టూ తిరిగొస్తుంది. దీనికంటే ముందు పుట్టిన గ్రహం శుక్రుడు. సూర్యునికి మరికొంచెం ఎడంగా ఉంటుంది. వరుసలో మూడవది భూమి. ఆ తరువాత కుజుడు (అంగారకుడు), గురువు, శని, యురేనస్, నెఫ్యూన్, ఫ్లూటో ఉంటాయి. చంద్రుడు భూమికి ఉపగ్రహం.
పుట్టిన మొదట్లో, ఇతర గ్రహాల్లాగే, భూమిగూడా నిప్పులబంతిగా ఉండేది. సూర్యునికి దూరంగా జరిగే ప్రక్రియలో దీని ఉపరితలం చల్లబడడమే కాక, ఒక ప్రత్యేక రసాయనిక సంయోగంతో ‘నీరు’ అనే పదార్థం దీని వాతావరణంలో ఏర్పడింది. నీరంటే మనకు అలవాటైన ద్రవరూపంలో ఉండేది గాదు; సెగలు కక్కే ఆవిరి. అయినా, యాదృచ్ఛికంగా జరిగిన ఈ రసాయనిక సంయోగం జీవరాసి ఆవిర్భావానికీ, యుగయుగాల చరిత్రకూ కీలకమై నిలిచింది. తనకున్న శక్తియుక్తులతో ఆధునిక మానవుడు నీటికణాల జాడ కోసం అంతరిక్షమంతా గాలించడం గమనిస్తే ఆ రసాయనిక సంయోగం ప్రాముఖ్యత ఎంత విలువైందో ఇట్టే తెలిసిపోతుంది.
‘నీరు’ అనేది ఒక రసాయనిక సంయోగంతో ఏర్పడే పదార్థం. ఒక ఆక్సిజన్ (ప్రాణవాయువు) పరమాణువుతో రెండు హైడ్రోజన్ (ఉదజని) పరమాణువులు కలిస్తే - మిశ్రమంగా కాదు, సంయోగంగా కలిస్తే - ‘నీరు’ అనేది ఏర్పడుతుంది. మిశ్రమంగా కలవడం వేరు, సంయోగంగా కలవడం వేరు. మిశ్రమమంటే మనకు తరచు వినిపించే ‘నవధాన్యాలు’ వంటిది. తొమ్మిది రకాల తిండిగింజలను కలిపి తొలకరిలో మొలకబోయడం తెలుగువారి ఆచారం. ఆ కలిసిన గింజలు ఒకదాని సరసన మరొకటి చేరివుంటాయే తప్ప రూపాన్ని కోల్పోయి కొత్త పదార్థంగా ఏర్పడవు. కావాలనుకుంటే ఏ గింజకు ఆ గింజను ఏరుకుని వేరుచేయొచ్చు. ఇలాటిదాన్ని ‘మిశ్రమం’ అంటాం. భోజనం తరువాత తాంబూలం వేసుకోవడమూ తెలుగువారి ఆచారమే. ఆకూ, వక్కా, సున్నమూ కలిపి బాగా నమిలితే ఎర్రటి ద్రవం ఊరుతుంది. ఆ ద్రవంలో ఆకురసం, వక్కరసం, సున్నం కలిసిపోయి వుంటాయి. ఎంతగా కలిసివుంటాయంటే - తిరిగి వాటిని విడివిడిగా పొందలేనంత సన్నిహితంగా కలిసిపోయివుంటాయి. దీన్ని ‘సంయోగం’ అంటాం.
ఆకాశంలో ఆక్సిజనూ హైడ్రోజను కలిసి ఇంత తేలిగ్గా తేమను పుట్టించే అవకాశమున్నప్పుడు, అదే మనకు వర్షంగా కురవకుండా, సముద్రంలో నీరు ఆవిరై, ఆ ఆవిరి మేఘాలుగా తయారై, ఆ మేఘాలు చల్లబడితే గాని చినుకు రాలనంత డొంకతిరుగుడు వ్యవహారం ఎందుకు ప్రవేశించిందో అనుమానం కలుగుతూందిగదా?