సెల్‌ఫోన్ ద్వారా రవాణా శాఖ సేవలు
* రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
* త్వరలో ఎం-వ్యాలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖ సేవలను సెల్‌ఫోన్ ద్వారా అందించి ప్రజలకు మరింత చేరువ చేయబోతున్నామని ఆ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. ఇందుకోసం ‘ఎం-వాలెట్’ విధానాన్ని రెండు మూడు నెలల్లో ప్రారంభిస్తామన్నారు. బుధవారం రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, జేటీసీలు వెంకటేశ్వర్లు, పాండురంగనాయక్, రఘునాథ్ తదితరులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..
లెసైన్సులు, ఆర్సీ, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ, బీమా... తదితర ఎన్నో సేవలను ఎం-వ్యాలెట్ ద్వారా అందించనున్నట్టు తెలిపారు. త్వరలో దీన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. రవాణాశాఖ కార్యాలయాలను ఈ-కార్యాలయాలుగా మారుస్తామని పేర్కొన్నారు. ఈ శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,125.5 కోట్ల ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే రూ. 1,925 కోట్లు సాధించామన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో శాఖ పనితీరు మెరుగుపడాల్సి ఉందని చెప్పారు.
త్వరలో అన్ని కార్యాలయాలకు సొంత భవనాలు సమకూరుస్తామని, ఈ విషయంలో కొన్ని జిల్లాల డీటీసీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని చెక్‌పోస్టుల పనితీరు సరిగా లేదని ఆక్షేపించారు. ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఓవర్‌లోడ్, ఫిట్నెస్ లేని వాహనాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని చెప్పారు. హెల్మెట్ ధారణపై వాహనదారుల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలని ఆదేశించారు.
నల్లగొండ జిల్లాకు నిధులు
నల్లగొండ జిల్లాకు సంబంధించి ఆర్టీఏ కార్యాలయ భవనం, సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, సూర్యాపేటలో ఎంవీఐ యూనిట్ కార్యాలయ భవనం, సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ నిర్మాణానికి రూ.4.56 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకోసం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి నల్లగొండ జిల్లా డీటీసీ చంద్రశేఖర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.