MA gafoor
-
కార్పొరేట్ కనుసన్నల్లో ప్రభుత్వాలు
- సీఐటీయూ ఆవిర్భావ సభలో గఫూర్ సాక్షి, విజయవాడ బ్యూరో: కార్పొరేట్ సంస్థల కనుసన్నల్లో పనిచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయని, కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోకపోతే సంఘటితంగా తిప్పికొడతామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ హెచ్చరించారు. విజయవాడలోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పతాకాన్ని ఆవిష్కరించిన గఫూర్ మాట్లాడారు. ఐక్యత-పోరాటం నినాదంతో 1970లో ఏర్పడిన సీఐటీయూ 46 ఏళ్లుగా కార్మిక-కర్షక ఐక్యత కోసం కృషి చేస్తోందని వివరించారు. దేశంలోని కార్మిక వర్గాన్ని సంఘటితపరిచే ఐక్యపోరాటాల రథసారథిగా సీఐటీయూ ఉందని అభివర్ణించారు. అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు, సంక్షేమ పథకాలు అమలుచేయకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని అన్నారు. కార్మికవర్గ ప్రయోజనాల కోసం సంఘటిత పోరాటాలు కొనసాగిస్తామన్నారు. జూన్ 26, 27, 28 తేదీల్లో విజయవాడలో సీఐటీయూ 14వ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మహాసభల ప్రారంభం రోజైన జూన్ 26న భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు కె.ఉమామహేశ్వరరావు, కె.ధనలక్ష్మి, కె.సుబ్బరావమ్మ, ఆర్.వి.నర్సింహారావు మాట్లాడారు. -
టీజీ వెంకటేష్ ఆర్థిక నేరస్థుడు: గఫూర్
కర్నూలు: కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ఆర్థిక నేరస్థుడని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం కర్నూలు అభ్యర్థి ఎం.ఏ. గఫూర్ ఆరోపించారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీజీ అనేక ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని, లక్షల టన్నుల పొటాషియం క్లోరైడ్‌ను దుబాయి నుంచి రైతుల పేరిట తన పరిశ్రమల అవసరాలకు దిగుమతి చేయించుకుంటున్నారని వెల్లడించారు. టన్ను రూ. 30 వేల విలువ చేసే పొటాషియం క్లోరైడ్‌ను రూ. 4,500కే కొనుగోలు చేస్తున్నారని, రైతుల పేరుతో కొనుగోలు చేస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం మిగిలిన రూ. 25,500ను సబ్సిడీగా భరిస్తోందన్నారు. ఇతర కేసుల్లో ఎక్సైజ్ డ్యూటీ రూ. 90 లక్షలు చెల్లించారని, అయినా ఆ వివరాలను ఆయన అఫిడవిట్లో చూపలేదని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. రాజకీయాలను అడ్డుపెట్టుకొని తన సొంత పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్న టీజీ నామినేషన్‌ను తిరస్కరించాలని కోరారు. ఆయనపై సీబీఐ విచారణ జరిపించి పరిశ్రమలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. -
2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనిపించదు
ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు గఫూర్ అనంతపురం, న్యూస్‌లైన్: అస్పష్టమైన ఆర్థిక, అలౌకిక విధానాల వల్ల రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దిగజారుతోందని, వచ్చే 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అదృశ్యమౌతుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ అన్నారు. ఆదివారం అనంతపురం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘ప్రస్తుత పరిస్థితులు - మైనార్టీలపై ప్రభావం’ సదస్సులో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉండగా, మతోన్మాది అయిన నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడం ప్రమాదకరమన్నారు. గోద్రా రైలు దహనంపై జరిగిన విచారణలో ఎక్కడా ముస్లింల పాత్ర ఉన్నట్లు తేలకున్నా, ఈ దుర్ఘటన సాకుతో గుజరాత్లో నరేంద్రమోడీ సాక్షిగా నరమేధం జరిగిందన్నారు. ఇటువంటి వ్యక్తికి మద్దతు ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తుండడం దారుణమన్నారు. ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో నూకలు చెల్లినట్టేనన్నారు.