ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు గఫూర్
అనంతపురం, న్యూస్‌లైన్: అస్పష్టమైన ఆర్థిక, అలౌకిక విధానాల వల్ల రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దిగజారుతోందని, వచ్చే 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అదృశ్యమౌతుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ అన్నారు. ఆదివారం అనంతపురం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘ప్రస్తుత పరిస్థితులు - మైనార్టీలపై ప్రభావం’ సదస్సులో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉండగా, మతోన్మాది అయిన నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడం ప్రమాదకరమన్నారు. గోద్రా రైలు దహనంపై జరిగిన విచారణలో ఎక్కడా ముస్లింల పాత్ర ఉన్నట్లు తేలకున్నా, ఈ దుర్ఘటన సాకుతో గుజరాత్‌లో నరేంద్రమోడీ సాక్షిగా నరమేధం జరిగిందన్నారు. ఇటువంటి వ్యక్తికి మద్దతు ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తుండడం దారుణమన్నారు. ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో నూకలు చెల్లినట్టేనన్నారు.