‘బ్రిజేష్’ తీర్పు అమలయితే... సాగర్ ఆయకట్టు ఎడారే
పాల్వంచ, న్యూస్‌లైన్: కృష్ణా జలాలపై బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుతో జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు చెప్పారు. ఆయన శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ తీర్పు అమలయితే జిల్లాలోని సాగర్ ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో కొంతవరకు (ప్రకాశం బ్యారేజీ వరకు) మాత్రమే సద్వినియోగమవుతున్నాయని అన్నారు. ట్రిబ్యునల్ తీర్పుతో నాగార్జున సాగర్‌కు నీరు వచ్చే పరిస్థితి ఉండదని అన్నారు. రాష్ట్రంలోని నదులపై ప్రాజెక్టులు లేనందునే నదీ జలాలు సముద్రంపాలవుతున్నాయని అన్నారు.
దీనిని చూపించే.. మిగులు జలాలను కర్ణాటక, మహారాష్ట్ర వినియోగించుకోవచ్చని బ్రిజెష్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చిందన్నారు. నదుల్లోని మిగులు జలాలను సాగుకు వినియోగించే లక్ష్యంతోనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి జల యజ్ఞం చేపట్టారని అన్నారు. దీనిని పూర్తిచేయడంలో వైఎస్ఆర్ తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని విమర్శించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా మిగులు జలాల వినియోగంపై ఇప్పుడు తర్జనభర్జన నెలకొందన్నారు. ఆంధ్రా, తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు కృష్ణా మిగులు జలాలను కర్ణాటక, మహారాష్ట్రకు కట్టబెట్టేందుకు చూస్తున్నదని విమర్శించారు. ఇకపై రాష్ట్రానికి సాగు నీరు అందక ఇబ్బందులేర్పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్‌లో సమర్థవంతంగా వాదనలు వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.