మరో ఇద్దరు మిలిటెంట్లు హతం
సాక్షి, న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ వద్ద చొరబాట్లకు ప్రయత్నించిన ఇద్దరు మిలిటెంట్లను భద్రతాబలగాలు హతమార్చాయి. కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్ వద్ద శనివారం ఉదయం ఇద్దరు మిలిటెంట్లు ఎల్ఓసీని దాటేందుకు ప్రయత్నించారు. వీరిని మొదటగా భద్రతాబలగాలు నిరోధించే ప్రయత్నం చేశాయి. దీంతో మిలిటెంట్లు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ప్రతికాల్పులకు దిగడంతో.. ఇద్దరూ ఉగ్రవాదులు మరణించారు. ఇదే విషయాన్ని రక్షణ శాఖ అధికార ప్రతినిధి రాజేష్కలియా ధృవీకరించారు. టెర్రరిస్టుల నుంచి ఆయుధాలు, గుర్తింపు కార్డులు, ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ నియంత్రణ రేఖ, జమ్మూ కశ్మీర్ సరిహద్దులో 22 సార్లు మిలిటెంట్లు చొరబాట్లకు ప్రయత్నించారని రాజేష్ తెలిపారు. అదే విధంగా.. చొరబాట్లకు ప్రయత్నించిన 38 మంది మిలిటెంట్లను భద్రతా బలగాలు మట్టుపెట్టాయని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా మాచిల్ సెక్టార్లో ఆగస్టు నుంచి ఇప్పటివరకూ చొరబాట్లకు ప్రయత్నించిన 5 మంది మిలిటెంట్లను చంపేసినట్లు ఆయన తెలిపారు.