నేడు మండలాధ్యక్షుల ఎన్నిక
* ఉదయం కో ఆప్షన్ సభ్యులు, మధ్యాహ్నం అధ్యక్ష,ఉపాధ్యక్ష ఎన్నికలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 396 మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల, ఉపాధ్యక్షుల ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. వీటితో పాటు కో ఆప్షన్ సభ్యులను కూడా ఎన్నుకుంటారు. తెలంగాణలో మొత్తం 443 మండలాలు ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాలోని 46 మండలాలు, వరంగల్లోని మంగపేట మండలానికి కోర్టు ఆదేశాల కారణంగా ఎన్నికలు జరగడం లేదు.
శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట మధ్యలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు అధ్యక్షుల ఎన్నికలు నిర్వహిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీటిలో సభ్యులైనప్పటికీ వారికి ఓటు వేసే అధికారం ఉండదు. ఈ మండలాల్లో మెజారిటీ స్థానాలను అధికారపార్టీ టీఆర్ఎస్ గెలుచుకొనేందుకు ప్రయత్నిస్తోంది. గురువారం జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో తగినంత సంఖ్యాబలం లేనప్పటికీ మెజారిటీ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోవడం గమనార్హం.