ప్రియుడి మోజులో పడి: చెల్లెకు సహకరించిన అన్న, బావ
మదనపల్లె టౌన్ : మామ హత్య కేసులో కోడలు, ఆమెకు అండగా నిలచిన సోదరుడు, బావను అరెస్ట్ చేసినట్లు శుక్రవారం టూటౌన్ సీఐ నరసింహులు, ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. వారి కథనం.. కురబలకోట మండలం, తెట్టు గ్రామం, ఎస్సీ కాలనీకి చెందిన వేణుగోపాలు పెయింట్ పనులు చేస్తూ తన భార్య తులసమ్మను ఉన్నత చదువులు చదివించాడు. ఆపై, ఆమెకు స్థానిక బర్మావీధిలోని 9వ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ ఉద్యోగం వచ్చింది.
ఉద్యోగంలో చేరాక ఆమె తీరు మారింది. తరచూ ఫోన్లో ఎవరితోనే ఆమె మాట్లాడుతుండడంతో వేణుగోపాలు అనుమానించాడు. ఈ నెల 2న ఆమె కార్యాలయం వద్ద ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో వేణుగోపాలు ఆ ఫోన్ లాక్కుని పరిశీలించాడు. ఆమె ప్రియునితో మాట్లాడుతోందని తెలుసుకుని తనతండ్రితోపాటు తులసమ్మ తల్లిదండ్రులు, బావకు సమాచారం ఇచ్చాడు. ఈ వ్యవహారమేమిటో తేల్చాలని అక్కడే పంచాయితీ పెట్టాడు. ఇందుకోసం వచ్చిన వేణుగోపాలు తండ్రి బి.ఓబులేసు (64)పై తులసమ్మ (30), ఆమె సోదరుడు రెడ్డెప్ప (43), ఇసుకనూతిపల్లెకు చెందిన ఆమె బావ ఆదెప్ప (45) దాడిచేసి కొట్టారు. దాడిలో ఓబులేసు మృతిచెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్టు చేశారు.