Madannapet Market
-
మాదన్నపేట మార్కెట్.. డబ్బు కొట్టు..బండి పెట్టు!
సాక్షి, చంచల్‌గూడ: పాతబస్తీలోని మాదన్నపేట మార్కెట్లో దళారీలు పేట్రేగిపోతున్నారు. ఈ మార్కెట్ ప్రైవేటు యాజమాన్యాది కావడంతో ప్రభుత్వ అజమాయిషీ ఉండదు. కేవలం రైతుల కూరగాయలు అమ్మిపెట్టే కమీషన్ ఏజెంట్ల వద్ద నుంచి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మార్కెట్ ఫీజు వసూలు చేస్తుంది. ఆకు కూరల విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం రైతులు, కమీషన్ ఏజెంట్ల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయదు. పలు రకాల ఆకు కూరలుతో పాటు కొత్తిమీర, కరివేపాకు విక్రయించేందుకు రంగారెడ్డి జిల్లాతో పాటు పలు రాష్ట్రాల నుంచి రైతులు నేరుగా ఈ మార్కెట్‌కు వస్తుంటారు. మార్కెట్లోని వ్యాపారులు రైతుల వద్ద నుంచి కూరగాయలు కొనుగోలు చేసి హోల్‌సేల్, రిటైల్ విక్రయాలు నిర్వహిస్తుంటారు. వాహనానికి రూ. 500 నుంచి రూ. 2 వేలు వసూలు ఇదిలా ఉండగా కొందరు రైతులు తమ వాహనాల్లో కూరగాయలు తెచ్చి నేరుగా అమ్మకాలు చేస్తారు. వాహనం నిలిపి విక్రయాలు చేస్తున్నందుకు కొందరు స్థానికులు, పాత నేరస్తులు రైతుల నుంచి ప్రతి రోజూ అక్రమంగా డబ్బులు దండుకుంటున్నారు. ఒక్కో వాహనానికి రూ. 500 నుంచి రూ. 2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అమ్మకాలను బట్టి మామూళ్ల ధరలు నిర్ణయిస్తున్నారు. రైతులు స్థానికేతరులు కావడంతో అక్రమార్కులకు తలొగ్గి గత్యంతరం లేక డబ్బులు చెల్లిచుకుంటున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి వ్యవసాయ మార్కెట్, పోలీసు శాఖ దృష్టి సారించి రైతులపై జరుగుతున్న దౌర్జన్యాలను అడ్డుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. పీడీ యాక్ట్ నమోదు చేయాలి మాదన్నపేట కూరగాయల మార్కెట్లో అక్రమ వసూళ్లపై పోలీసులు, మార్కెట్ శాఖ దృష్టి సారించాలి. కూరగాయల రైతుల నుంచి కమీషన్ వసూలు చేసే వ్యవస్థను రద్దు చేయాలి. 2 శాతం కమీషన్ తీసుకోవాల్సిన ఏజెంట్లు అక్రమంగా 10 శాతం వరకు వసూలు చేస్తున్నా మార్కెట్ శాఖ చర్యలు తీసుకోవడం లేదు. ఏజెంట్ల ఆగడాలను అరికట్టేందుకు మార్కెట్లో ఫిర్యాదు సెల్‌ను ఏర్పాటు చేయాలి. రైతులను వేధిస్తే పీడీ యాక్ట్ నమోదు చేయాలి. – సహదేవ్‌యాదవ్, మాజీ కార్పొరేటర్ -
మాదన్నపేట్ మార్కెట్లో అగ్ని ప్రమాదం
చంచల్‌గూడ: కుర్మగూడ డివిజన్ మాదన్నపేట్ కూరగాయల మార్కెట్లో శనివారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ భారీ షెడ్డు, అందులో నిల్వ ఉంచిన కూరగాయలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్యూ్కట్ కాణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని ఇన్స్పెక్టర్ రాజు తెలిపారు. కరెంటు స్తంభానికి ఉన్న సర్వీస్ వైర్లు కాలుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయని పోలీసులు తెలిపారు. మార్కెట్ కమిటీ సెక్రటరీ మాధురి సంఘటన స్థలాన్ని పరిశీలించి కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులతో మాట్లాడారు. ప్రమాదంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. అగ్నికి ఆహుతైన షెడ్డు విలువ రూ. 40 లక్షలు ఉంటుందని మార్కెట్ యాజమాన్యం పేర్కొంటోంది. షెడ్డులోని 50 మోండాల్లోని కూరగాయలు, ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్లు పూర్తిగా కాలిపోవడంతో మరో రూ.30 లక్షలు నష్టం వాటిల్లిందని వ్యాపారులు తెలిపారు. ప్రమాదంపై అనుమానాలు ప్రమాదంపై కమీషన్ ఏజెంట్ల సంఘం అనుమానాలు వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షుడు ఎల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి కట్కిరెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ షాక్ సరŠూక్యట్తో భారీ అగ్ని ప్రమాదం జరగడం నమ్మశక్యంగా లేదని, 10 నిమిషాల్లో షెడ్డు మొత్తం కాలిపోవడం, పచ్చి కూరగాయలు బుడిద కావడం విడ్డూరంగా ఉందన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో విద్యుత్ స్తంభం నుంచి నిప్పురవ్వలు రోడ్డుపై పడిన దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయని, మంటలంటుకున్నట్లు ఎక్కడా లేదన్నారు. మండీలో వివాదాలు ఉన్నందున ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తున్నామన్నారు. కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.