మాదన్నపేట మార్కెట్‌.. డబ్బు కొట్టు..బండి పెట్టు!  | Madannapet Vegetable Market: Taking Illegal Commission From Farmers At Madannapet Vegetable Market | Sakshi
Sakshi News home page

మాదన్నపేట మార్కెట్‌.. డబ్బు కొట్టు..బండి పెట్టు! 

Feb 21 2022 11:33 AM | Updated on Feb 21 2022 11:49 AM

Madannapet Vegetable Market: Taking Illegal Commission From Farmers At Madannapet Vegetable Market - Sakshi

సాక్షి, చంచల్‌గూడ: పాతబస్తీలోని మాదన్నపేట మార్కెట్‌లో దళారీలు పేట్రేగిపోతున్నారు. ఈ మార్కెట్‌ ప్రైవేటు యాజమాన్యాది కావడంతో ప్రభుత్వ అజమాయిషీ ఉండదు. కేవలం రైతుల కూరగాయలు అమ్మిపెట్టే కమీషన్‌ ఏజెంట్ల వద్ద నుంచి వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ మార్కెట్‌ ఫీజు వసూలు చేస్తుంది.  ఆకు కూరల విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం రైతులు, కమీషన్‌ ఏజెంట్ల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయదు. పలు రకాల ఆకు కూరలుతో పాటు కొత్తిమీర, కరివేపాకు విక్రయించేందుకు రంగారెడ్డి జిల్లాతో పాటు పలు రాష్ట్రాల నుంచి రైతులు నేరుగా ఈ మార్కెట్‌కు వస్తుంటారు. మార్కెట్‌లోని వ్యాపారులు రైతుల వద్ద నుంచి కూరగాయలు కొనుగోలు చేసి హోల్‌సేల్, రిటైల్‌ విక్రయాలు నిర్వహిస్తుంటారు.  

వాహనానికి రూ. 500 నుంచి రూ. 2 వేలు వసూలు 
ఇదిలా ఉండగా కొందరు రైతులు తమ వాహనాల్లో కూరగాయలు తెచ్చి నేరుగా అమ్మకాలు చేస్తారు. వాహనం నిలిపి విక్రయాలు చేస్తున్నందుకు కొందరు స్థానికులు, పాత నేరస్తులు రైతుల నుంచి ప్రతి రోజూ అక్రమంగా డబ్బులు దండుకుంటున్నారు.  ఒక్కో వాహనానికి రూ. 500 నుంచి రూ.  2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అమ్మకాలను బట్టి మామూళ్ల ధరలు నిర్ణయిస్తున్నారు. రైతులు స్థానికేతరులు కావడంతో అక్రమార్కులకు తలొగ్గి గత్యంతరం లేక డబ్బులు చెల్లిచుకుంటున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి వ్యవసాయ మార్కెట్, పోలీసు శాఖ దృష్టి సారించి రైతులపై జరుగుతున్న దౌర్జన్యాలను అడ్డుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

 పీడీ యాక్ట్‌ నమోదు చేయాలి 
మాదన్నపేట కూరగాయల మార్కెట్‌లో అక్రమ వసూళ్లపై పోలీసులు, మార్కెట్‌ శాఖ దృష్టి సారించాలి. కూరగాయల రైతుల నుంచి కమీషన్‌ వసూలు చేసే వ్యవస్థను రద్దు చేయాలి. 2 శాతం కమీషన్‌ తీసుకోవాల్సిన ఏజెంట్లు అక్రమంగా 10 శాతం వరకు వసూలు చేస్తున్నా మార్కెట్‌ శాఖ చర్యలు తీసుకోవడం లేదు. ఏజెంట్ల ఆగడాలను అరికట్టేందుకు మార్కెట్‌లో ఫిర్యాదు సెల్‌ను ఏర్పాటు చేయాలి.  రైతులను వేధిస్తే పీడీ యాక్ట్‌ నమోదు చేయాలి. 
– సహదేవ్‌యాదవ్, మాజీ కార్పొరేటర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement