అమెరికా నుంచి వెలువడిన ఒక రిపోర్టులో చైనాకు సంబంధించిన మరో వ్యూహం వెలుగుచూసింది. పాకిస్తాన్ మీడియాను చైనా తన నియంత్రణలోకి తెచ్చుకోవాలనుకుంటోందని ఈ రిపోర్టులో పేర్కొన్నారు. ఇందుకోసం చైనా తన ఇతర మిత్ర దేశాల సహకారం తీసుకుంటున్నదని సమాచారం. పాక్‌లో చైనా తన అంతర్జాతీయ ప్రచారాల నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తోందని నిపుణులు అంచనావేస్తున్నారు.
ప్రపంచంలో తనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకునేందుకు, పలు విమర్శలను తిప్పికొట్టేందుకు చైనా సమాచార రంగంలో రష్యాతో కలిసి పని చేస్తోంది. కాగా పాకిస్తాన్‌లో చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీపీఈసీ ప్రాజెక్టుపై అంతర్జాతీయ మీడియాలో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో సీపీఈసీ మీడియా ఫోరమ్ ద్వారా ఈ ఆరోపణలు ఎదుర్కోవాలని చైనా నిర్ణయించుకుంది.
ఇందుకోసం చైనా, పాకిస్తాన్ సంయుక్తంగా సీపీఈసీ ర్యాపిడ్ రెస్పాన్స్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ ప్రచారాన్ని ప్రారంభించాయి. దీనిలో భాగంగా చైనా-పాకిస్తాన్ మీడియా కారిడార్ త్వరలోనే ప్రారంభం కానుంది. 2021లో చైనా పాకిస్తాన్‌ల మధ్య ఈ అంశంపై చర్చలు కూడా జరిగాయి. చైనాపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు రెండు దేశాలు సంయుక్తంగా ఒక వేదికను రూపొందించడంపై కూడా చర్చిస్తున్నట్లు యుఎస్ నివేదిక పేర్కొంది.
చైనా రాయబార కార్యాలయానికి సంబంధించిన వార్తలకు పాక్ మీడియాలో అత్యధికప్రాధాన్యత కల్పించనున్నారు. చైనా ప్రభుత్వం తనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తోందని నివేదిక పేర్కొంది. తైవాన్, మానవ హక్కులు, దక్షిణ చైనా సముద్రం, దేశీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రతికూల వార్తలకు అడ్డుకట్టవేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ రిపోర్టులో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: అడవిలో వీడియో తీస్తున్న వ్యక్తిపై పిడుగు పడితే?
Comments
Please login to add a commentAdd a comment