ఆసియా పురుషుల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో చైనా సంచలన విజయం సాధించింది. సెమీస్‌లో పాకిస్తాన్‌ను మట్టికరిపించి.. తొలిసారి ఈ టోర్నమెంట్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఉత్కంఠగా సాగిన షూటౌట్‌లో గోల్‌కీపర్ సైయూ వాంగ్ తన అద్భుత ప్రదర్శనతో చైనాకు ఈ చిరస్మరణీయ గెలుపు అందించాడు.
సెమీస్‌లో ఆ నాలుగు జట్లు
మరోవైపు.. పాకిస్తాన్‌కు కాంస్య పతక పోరు రూపంలో మెడల్ గెలిచేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. చైనాలోని హులున్‌బుయిర్‌లో గల మోకీ హాకీ ట్రెయినింగ్ బేస్‌లో ఆసియా చాంపియన్స్ హాకీ పోటీలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్, పాకిస్తాన్, దక్షిణ కొరియా, చైనా టాప్-4లో నిలిచాయి.
1-1తో సమం.. షూటౌట్‌లో ఫలితం
ఈ క్రమంలో తొలి సెమీస్‌లో చైనా సోమవారం పాకిస్తాన్‌తో తలపడింది. ఆట 18వ నిమిషంలో డ్రాగ్‌ఫ్లికర్ యువాన్లిన్ లూ గోల్ కొట్టి చైనాకు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత పాకిస్తాన్ ఐదుసార్లు పెనాల్టీ కార్నర్‌ల ద్వారా గోల్ కొట్టేందుకు ప్రయత్నించినా.. చైనా డిఫెన్స్ చేసింది. అయితే, 37వ నిమిషంలో అహ్మద్ నదీం అద్భుతంగా ఆడి గోల్ కొట్టగా.. ఆ తర్వాత చైనా మళ్లీ పాకిస్తాన్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో మ్యాచ్ 1-1తో డ్రా కాగా.. షూటౌట్ నిర్వహించారు. చైనా తరఫున బెన్హాయి, చింగాలియాంగ్ లిన్ గోల్స్ కొట్టగా.. పాకిస్తాన్ ఒక్కటీ స్కోరు చేయలేకపోయింది. చైనా గోల్ కీపర్ సైయూ వాంగ్ పాక్ జట్టుకు అడ్డుగోడలా నిలిచి తమ జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. షూటౌట్‌లో చైనా 2-0తో పాకిస్తాన్‌పై గెలిచి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.
మరో సెమీస్‌లో భారత్- కొరియా జట్లు తలపడుతున్నాయి. భారత్ ఇప్పటికే 4-0తో పటిష్ట స్థితిలో నిలిచి ఫైనల్‌కు చేరువైంది. ఇక ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు పాకిస్తాన్‌తో కాంస్య పతకం కోసం పోటీ పడుతుంది.
చదవండి: కోహ్లి, రోహిత్ కాదు!.. ఆ షాట్లు ఆడటంలో వాళ్లే బెస్ట్: అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment