
జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి
‘జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ తన కూతురు జనన ధ్రువీకరణ పత్రం తీసుకునేందుకు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. అక్కడ కనిపించిన ఓ సిబ్బందిని బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చే కార్యాలయం అడ్రస్ అడగగా, సర్టిఫికెట్ తీసుకోవడం పెద్ద ప్రాసెస్ ఉంటుందని.. తనకు రూ.2000 ఇస్తే వారం రోజుల్లో సర్టిఫికెట్ చేతులో పెడతానని నమ్మబలికాడు. చేసేది లేక చంద్రశేఖర్ డబ్బులు ఇచ్చి వారం రోజుల తర్వాత సర్టిఫికెట్ తీసుకున్నాడు.’
కరీంనగర్‌టౌన్: జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. గతంలో మ్యాన్‌వల్‌గా ఇచ్చే సర్టిఫికెట్లను ఏడాది కాలంగా నుంచి ఆన్‌లైన్‌కు మార్చారు. మీసేవలో దరఖాస్తు చేసుకొని ఉచితంగా పొందాల్సిన సర్టిఫికెట్కు వందలు, వేలు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తూ అమాయకుల వద్ద అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు.
మ్యాన్‌వల్‌గా ఇచ్చిన సర్టిఫికెట్లు అన్ని ప్రాంతాలలో చెల్లడం లేదనే ఉద్దేశంతో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో డెలివరీ అయిన పిల్లలకు సైతం జనన ధ్రువీకరణ పత్రాలు మీసేవలోకి మార్చారు. మ్యాన్‌వల్‌గా ఉన్నప్పుడు దందా నడిపించిన కేటుగాళ్లు ఆన్‌లైన్‌కు మార్చినా వదలడం లేదు. అమాయకులు సర్టిఫికెట్ల కోసం ఆసుపత్రికి వస్తే వారిని మోసం చేస్తూ డబ్బులు వసూళ్లకు తెగబడుతున్నారు. కొంత మంది సిబ్బంది ఆసుపత్రి ముందు తిష్ట వేసి సర్టిఫికెట్ల కోసం వచ్చేవారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని వేలల్లో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా మీసేవకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లో సర్టిఫికెట్ వస్తుంది. అది తెలియని వారిని దళారులు బోల్తా కొట్టిస్తున్నారు. ఇలా ఉచితంగా పొందాల్సిన సర్టిఫికెట్లకు వేలల్లో వసూలు చేస్తుండడంతో సర్టిఫికెట్లు పొందే వారు ఆందోళన చెందుతున్నారు.
మరణ ధ్రువీకరణాల పరిస్థితి దారుణం
జనన ధ్రువీకరణ సర్టిఫికెట్లకే ఇంత ఇబ్బంది అవుతుంటే ఇక మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ల విషయంలో చుక్కలు చూపిస్తున్నారు. ఏకంగా సిబ్బందితో కుమ్మక్కై దళారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో రికార్డు లేకపోతే ఆసుపత్రి నుంచి మరణ నివేదికను తీసుకెళ్లి మున్సిపల్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని రికార్డులను దాచిపెట్టి దొరకడం లేదంటూ ఆసుపత్రి చుట్టూ తిప్పుకుంటున్నారు. చివరకు బేరం కుదిరితే రికార్డులు దొరికాయంటూ మరణ నివేదిక రాసి ఇస్తున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతాం..
జనన, మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం వచ్చేవారు ఎవరికీ డబ్బులు ఇవ్వద్దు. సర్టిఫికెట్లు ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా పొందాలి. ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా ఆసుపత్రిలో ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతాం. ఆసుపత్రి సిబ్బంది డబ్బులు తీసుకున్నట్లు నిరూపణ అయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ జ్యోతి, జిల్లా ఆసుపత్రి ఆర్‌ఎంవో
చదవండి: అబ్దుల్లాపూర్ మెట్‌లో దారుణం.. జంట మృతదేహాల కలకలం
Comments
Please login to add a commentAdd a comment