madanpalle
-
ఆ మార్కెట్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టమాటా.. ఏకంగా..!
మదనపల్లె: చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంతగా టమాటా అత్యధిక ధర పలికింది. సోమవారం మార్కెట్లో మొదటిరకం టమాటా ధర కిలో రూ.104 వరకు పలికింది. వారం రోజులుగా మదనపల్లె డివిజన్ పరిధిలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో టమాటా దిగుబడులు తగ్గుముఖం పట్టాయి. కాయలు కోసేందుకు వీలు లేకుండా పొలాల్లో నీళ్లు నిలిచి ఉండడం, వర్షం దెబ్బకు పంట నాణ్యత కోల్పోవడం, డ్యామేజీ అధికంగా ఉండడం వంటి కారణాలతో సరుకు లభ్యత కష్టమవుతోంది. మదనపల్లె, తంబళ్లపల్లె, కర్ణాటకలోని శ్రీనివాసపురం, రాయల్పాడు తదితర ప్రాంతాల నుంచి రైతులు సోమవారం మార్కెట్‌కు 260 మెట్రిక్ టన్నుల టమాటాను తీసుకువచ్చారు. వాటిలో మొదటిరకం టమాటా కిలో రూ.60–104 వరకు ధర పలికింది. రెండోరకం టమాటా ధరలు కిలో రూ.18–58 మధ్య నమోదయ్యాయి. వరుసగా వస్తున్న భారీ వర్షాలు, తుపానులతో దేశంలోని అనేక ప్రాంతాల్లో టమాటా పంట బాగా దెబ్బతింది. ప్రజావసరాలకు సరిపడా టమాటా మార్కెట్లో దొరకడం లేదు. దీంతో ఉన్నపళంగా సరుకుకు డిమాండ్ ఏర్పడి మంచి ధరలు పలుకుతున్నాయని, ఇవి ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదని స్థానిక వ్యాపారులు చెపుతున్నారు. -
రేపటి నుంచి మస్తాన్‌వలి ఉరుసు ఉత్సవాలు
మదనపల్లె: చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం కోట వీధిలోని ప్రముఖ హజరత్ ఖాజా సయ్యద్ షా మస్తాన్‌వలి దర్గా ఉరుసు ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దర్గా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్గాను రంగురంగు విద్యుద్దీపాలతో అలంకరించారు. మంగళవారం ఉదయం గంధం, బయాన్ (ధార్మిక ఉపన్యాసం), అన్నదానం నిర్వహిస్తారు. 24వ తేదీ ఉదయం ఉరుసు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఉరుసు ఉత్సవాలకు కడప సద్గురు హజరత్ సయ్యద్ షా అరిపుల్లా మొహమ్మద్ మహమ్మదుల్ హుస్సేని చిష్టివుర్‌ఖాద్రితోపాటు పలువురు గురువులు హాజరుకానున్నట్లు దర్గా అధ్యక్షుడు సత్తార్‌ఖాన్ తెలిపారు. 25న మధ్యాహ్నం తహలీల్ ఫాతెహా జరుగుతుందన్నారు. ఉరుసు ఉత్సవాలకు హిందూముస్లిం సోదరులు హాజరు కావాలని కోరారు. -
ముగ్గురు వాహన దొంగల అరెస్ట్
మదనపల్లి: చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు ముగ్గురు వాహన దొంగలను బుధవారం అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు పట్టణంలోని చౌడశ్రీ కల్యాణమండపం మసీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శివరాజ్ (20), ఉదయ్ (17)తో పాటు వైఎస్సార్ జిల్లాకు చెందిన వేణుగోపాల్‌లు బెంగళూరులో మూడు, మదనపల్లిలో ఒక ద్విచక్రవాహనం చోరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
భద్రాచలం సబ్ కలెక్టర్ గుప్తా బదిలీ
భద్రాచలం, న్యూస్‌లైన్ : భద్రాచలం సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా బదిలీ అయ్యారు. ఆయనను చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న గుప్తా భద్రాచలం సబ్ కలెక్టర్‌గా గత ఏడాది ఆగస్టు 28న బాధ్యతలు చేపట్టారు. గత ఏడాది ముక్కోటి ఉత్సవాలు, అదే విధంగా ఈ ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలను విజయవంతం చేయటంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. రెవెన్యూ పాలన ను గాడిలో పెట్టే క్రమంలో తన కార్యాలయంలో డ్రస్ కోడ్‌ను అమలు చేయించారు. జిల్లాలో డ్రస్కోడ్ అమలు అనేది భద్రాచలంలోనే ప్రథమం కావటం గమనార్హం. విధుల్లో చేరిన మొదట్లో రెవెన్యూ యంత్రాంగానికి ముచ్చెమటలు పట్టించారు. అదే విధంగా గిరిజన సహకార సంస్థకు చెందిన డీఆర్‌డిపోలు, సివిల్ సప్లైకు చెందిన రేషన్ దుకాణాలను తనిఖీ చేసి అత్యధిక సంఖ్యలో కేసులు నమోదు చేశారు. ఐఏఎస్ స్థాయి అధికారి హోదాలో ఇలా రేషన్ దుకాణాలను తనిఖీ చేయటం ద్వారా నిత్యావసర సరుకులు సక్రమంగా అందేలా తగు చర్యలు తీసుకున్నారు. అయితే ఇసుక రీచ్‌ల నిర్వహణలో తలెత్తిన లోపాలు సబ్‌కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాకు మచ్చతెచ్చిపెట్టాయి. అదే విధంగా 1/70 చట్టాన్ని పరిరక్షించటంలో కూడా ఆయన ఉదాసీనంగా వ్యవహరించారనే విమర్శలను మూటగట్టుకున్నారు. కాగా, ఈయన స్థానంలో భద్రాచలం సబ్ కలెక్టర్‌గా ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. అయితే ఆర్డీవో స్థాయి అధికారిని మళ్లీ ఇక్కడ నియమించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం ఉంది. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉండే ఆర్డీవో స్థాయి అధికారిని ఇక్కడికి తీసుకొచ్చేందుకు జిల్లాకు చెందిన నేత ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.