మదాసి కురువ కుల ధ్రువీకరణపై కలెక్టర్ విచారణ
కర్నూలు(అగ్రికల్చర్): మదాసి కురువ కులధ్రువీకరణ పత్రం జారీపై వచ్చిన అప్పీల్పై సోమవారం జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ విచారణ చేపట్టారు. పగిడ్యాలకు చెందిన శివలింగం మదాసి కురువ ఎస్సీ కులధ్రువీకరణ పత్రం కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ ధ్రువపత్రం ఆర్డీఓ జారీ చేయాల్సి ఉండగా తహసీల్దారు ఏకపక్షంగా తిరస్కరించారు. దీనిపై శివలింగం తగిన న్యాయం చేయాలని కలెక్టర్ కోర్టులో న్యాయవాది ద్వారా తగిన ఆధారాలతో అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై కలెక్టర్ విచారణ జరిపారు. శివలింగం తన న్యాయవాది ద్వారా హజరయ్యారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలో మదాసి కురువలు ఉన్నారా..ఉంటే వారి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు తదితరవాటిపై విచారణ జరిపిస్తానని తెలిపారు. కులాన్ని నిరూపించుకునేందుకు తగిన ఆధారాలతో రావాలని సూచిస్తూ విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు. అనంతరం శివలింగం విలేకర్లతో మాట్లాడుతూ.... మదాసి కురువ అని నిరూపించుకునేందుకు తగిన ఆధారాలతో అంటే గురవయ్యలు, తదితరులను తీసుకొని వచ్చామని తెలిపారు. అయితే కలెక్టర్ పరిశీలించలేదని వివరించారు. ఈ కార్యక్రమంలో మదాసి కురువల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.