ఆలయాల భూ పత్రాలన్నీ ఆయన ఇంట్లోనే!
సాక్షి, అమరావతి/విజయవాడ లీగల్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బుధవారం దొరికిపోయిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ మేడేపల్లి విజయరాజు వ్యవహారంలో తవ్వేకొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఏపీ, తెలంగాణాల్లోని ఆరు ప్రాంతాల్లో బుధవారం దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు గురువారం కూడా సోదాలు కొనసాగించారు. తన ఇంటినే అడ్డాగా చేసుకుని సాగించిన అక్రమాలు చూసి అధికారులు కంగుతింటున్నారు. అన్నవరం, సింహాచలం, పెనుగంచిప్రోలు, హైదరాబాద్లోని ఎల్లమ్మ దేవాలయాలతో పాటు ఏపీలోని 13 జిల్లాల్లోని దేవాలయ భూముల పత్రాలను ఏసీబీ అధికారులు ఆయన ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. కాగా, దేవాలయ భూములను ఆక్రమించకున్న వారు, ఇతర అవసరాలకు వాడుకుంటున్న వారు, వివాదాలలో చిక్కుకున్న వాటి విషయంలో విజయరాజును ఆశ్రయిస్తే.. కోర్టుకు వెళ్లాలని ఆయనే సలహా ఇస్తాడని ఏసీబీ దృష్టికి వచ్చింది.
కోర్టు ఎలా స్పందించినా దాన్ని అవకాశంగా తీసుకుని అవినీతికి పాల్పడుతున్నట్టు ఏసీబీ విచారణలో తేలింది. కోర్టు పరిధిలోకి వెళ్లే పలు కేసుల్లో ‘వెరిఫై ఇట్’ అని చేసే సూచనలను కూడా విజయరాజు అడ్డుపెట్టుకుని, దేవాలయ భూములను వాడుకుంటున్న వారి నుంచి పెద్ద మొత్తాలు తీసుకున్నట్టు ఏసీబీ గుర్తించింది. ఈ వ్యవహారాల్లో శాఖాపరంగా కొందరికి లబ్ది చేకూర్చి పెద్దఎత్తున అక్రమార్జనకు పాల్పడినట్టు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. విజయరాజు ఇంట్లో దొరికిన పత్రాలు, జిరాక్స్ కాపీలు, తెలంగాణాకు చెందిన రెండు ఫైళ్లు, ఏపీకి చెందిన ఒక ఫైలును అధికారులు దేవాదాయ శాఖకు అప్పగించారు. కాగా, విజయరాజుకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎం.వెంగయ్య గురువారం ఉత్తర్వులు జారీచేశారు.