ఆర్‌అండ్‌బీలో ప్రక్షాళన!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వం రహదారుల నిర్మాణం, విస్తరణ కు పెద్దపీట వేయడమే కాకుండా, ఆ శాఖను ప్రక్షాళన చేస్తోంది. జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు అధికారుల నియామకానికి శ్రీకారం చుడుతోంది. ఈ నేపథ్యం లోనే జిల్లాలో బదిలీల ప్రక్రియ ప్రారంభం కావడం అధికారులలో చర్చనీయాంశంగా మారింది. ఆర్అండ్బీ ఎస్ఈగా పనిచేసిన ఎన్.మాధవి సుకన్యను ప్రభుత్వం ఇటీవలే బదిలీ చేసింది. ఆమె స్థానంలో పి.మధుసూదన్‌రెడ్డి నియమించగా, ఆయన ఈ నెల నాలుగున బాధ్యతలు తీసుకున్నారు.
నిజామాబాద్ డివిజన్ ఈఈగా పనిచేస్తున్న సీహెచ్ అంజయ్యను అకస్మాత్తుగా బదిలీ చేస్తూ గురువారం ఉ త్తర్వులు వెలువడ్డాయి. ఆయనను బోధన్ ఈఈగా పంపించి, రంగారెడ్డి జిల్లా సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఇంజనీరింగ్ విభాగంలో డెప్యూటేషన్‌పై విధులు నిర్వ హిస్తున్న ఎస్.రాఘవేందర్రెడ్డిని నిజామాబాద్ ఈఈగా నియమించారు. జిల్లాలో రూ.1011.50 కోట్ల విలువ చేసే పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో త్వరలోనే మరికొందరు డెప్యూటీ ఈఈలు, ఎఈఈలకు స్థానచలనం కలిగే అవశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.
టెండర్ల ద్వారా పనులు
రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, వంతెనల విస్తరణ, నిర్మాణాల కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి ఆయా మండల కేంద్రాలకు అనుసంధానం చేసే తారురోడ్లు, శిథిలమైన, కొత్త వంతెనల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1011.50 కోట్లను కేటాయిం చింది. రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షణలో జిల్లాలోని 49 సింగిల్‌లైన్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చనున్నారు.
గ్రామాలకు మండల అనుసంధానం కోసం 14 రహదారులు, శిథిలమైన వాటితో కలిపి మొత్తం 35 వంతెనలు నిర్మించేందుకు అధికారులు గతంలో పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పను ల కోసం మొత్తంగా రూ.1011.50 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ల ద్వారా పనుల చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వాటిని త్వరి తగతిన పూర్తి చేసేందుకు రహదారులు, భవనాల శాఖలో బదిలీల ప్రక్షాళన జరుగుతుండటం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.