Madhucon
-
ఈడీనే బురిడీ కొట్టిద్దామని..
సాక్షి, హైదరాబాద్: ఎన్‌హెచ్–33 పనుల కోసం తీసుకున్న రుణంలో కొంత భాగం పక్కదారి పట్టించిన కేసులో టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావుకు చెందిన మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులనే బురిడీ కొట్టించాలని చూసింది. తమ కాంట్రాక్టును పూర్తి చేయడానికి సబ్ కాంట్రాక్టుల సాయం తీసుకొని వాళ్లకు డబ్బులు చెల్లించామని కొన్ని లేఖలు ఈడీకి అందించింది. అలా సబ్ కాంట్రాక్టులు ఇచ్చామని చెప్పిన సంస్థల్లో ఓ ఉత్తరప్రదేశ్ కంపెనీ యజమానిని ఈడీ అధికారులు పిలిచి లేఖలు చూపించగా అవన్నీ నకిలీవని తేలింది. దీనిపై ఆ సంస్థ యజమాని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మధుకాన్ కంపెనీస్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రూ.1,151 కోట్ల రుణం తీసుకొని.. జార్ఖండ్‌లో రాంచీ–రార్‌గావ్–జంషెడ్పూర్ మధ్య 163 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి–33 పనులను మధుకాన్ సంస్థ దక్కించుకుంది. రూ.1,151 కోట్ల వ్యయంతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (బీవోటీ) పద్ధతిలో దీన్ని వశం చేసుకుంది. ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్ కింద రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నుంచి దక్కించుకున్న టెండర్‌ను చూపించి కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,029.39 కోట్లు రుణంగా పొందింది. మధుకాన్ తీసుకున్న రుణం నుంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం జార్ఖండ్ హైకోర్టుకు చేరడంతో దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ కేంద్రంగా పని చేసే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ)ను ఆదేశించింది. ఈ శాఖ దర్యాప్తులో రూ.264.01 కోట్లను మధుకాన్ సంస్థ పక్కదారి పట్టించినట్లు తేలింది. దీంతో బ్యాంకు కన్సార్టియం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న కె. శ్రీనివాసరావు, ఎన్. సీతయ్య, ఎన్. పృథ్వీతేజను నిందితులుగా పేర్కొంటూ 2019లో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఆ తర్వాతి ఏడాది న్యాయస్థానంలో అభియోగపత్రాలను దాఖలు చేసింది. మనీల్యాండరింగ్ జరిగినట్టు గుర్తించి.. సీబీఐ అభియోగపత్రాల ఆధారంగా ఈ వ్యవహారంలో భారీ స్థాయిలో మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ అధికారులు మరో కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. గతేడాది జూన్‌లో నామా నివాసం, కంపెనీల్లో సోదాలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నం.19లో ఉన్న నామా నాగేశ్వర్రావు ఇల్లు, రోడ్ నం.36లో ఉన్న మధుకాన్ కంపెనీ, రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ డైరెక్టర్ల ఇళ్లు కలిపి 6 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ విచారణకు హాజరైన పలువురు మధుకాన్, రాంచీ ఎక్స్‌ప్రెస్ వే సంస్థల ప్రతినిధులు నిధుల చెల్లింపు విషయమై కొన్ని పత్రాలను ఈడీ అధికారులకు సమర్పించారు. రోడ్ కాంట్రాక్టు పూర్తి చేయడానికి చాలా సబ్ కాంట్రాక్టుల సాయం తీసుకున్నామని, వారికి చెల్లింపులు జరిపామని వాటిలో పేర్కొన్నారు. సబ్ కాంట్రాక్టర్లు చెల్లింపులు జరిగినట్లు ఇచ్చిన లేఖలను ఈడీ అధికారులకు అందించారు. ఆ లేఖల ఆధారంగా సబ్ కాంట్రాక్టర్లను ఈడీ అధికారులు పిలిచి విచారించారు. మధుకాన్ వద్ద రాంచీ–రార్‌గావ్–జంషెడ్పూర్ జాతీయ రహదారి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థల్లో ఉత్తరప్రదేశ్‌లోని మధుపూర్‌కు చెందిన డీఆర్ విజన్స్ ఒకటి. సదరు ఎక్స్‌ప్రెస్ వేలో 114 కిలోమీటర్ నుంచి 277 కిలోమీటర్ వరకు ఎర్త్‌వర్క్‌ను ఈ సంస్థ నిర్వర్తించింది. దీంతో ఈడీ ఇటీవల బీఆర్ విజన్స్ యజమాని రామ్‌సాయి సింగ్‌ను విచారణకు పిలిచింది. ఆ లేఖలను చూసి అవాక్కయిన ఆయన ఆ లేఖలతో తనకు కానీ, తమ ప్రతినిధులకు కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ రెండు లేఖల ద్వారా మధుకాన్ సంస్థ బ్యాంకులతో పాటు ఇతర సంస్థలకు రూ.18 కోట్లు నష్టం వాటిల్లేలా వ్యవహరించిందని చెప్పారు. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) ఫిర్యాదు చేశారు. ప్రాథమిక పరిశీలన తర్వాత మధుకాన్ సంస్థపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో కొన్ని ఆ«ధారాలు సేకరించాక మధుకాన్ సంస్థతో పాటు బాధ్యులకు నోటీసులు జారీ చేయనున్నారు. -
మధుకాన్ అంటే మోసం
నామా ప్రాజెక్టులు కాంట్రాక్టులు తీసుకుని కట్టకుండా పారిపోతాడు జార్ఖండ్‌లో హైవే నిర్మాణం కోసం నేనే చాలాసార్లు ఫోన్ చేశాను పోలవరం నిర్వాసితులెవరినీ బలవంతంగా ఖాళీ చేయించం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, మరోచోట మైనింగ్ వర్శిటీ ఏర్పాటు చేస్తాం విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి జైరాం రమేశ్ సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ‘ఇక్కడ టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీచేస్తున్నారు. ఆయన స్థాపించిన ‘మధుకాన్’ కంపెనీలో మధు లేదు.. కాన్ మాత్రమే ఉంది.. కాన్ అంటే మోసం.. మధుకాన్ అంటేనే మోసం.’ అని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. మధుకాన్ అధినేత నామా నాగేశ్వరరావు చాలా రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడతానని కాంట్రాక్టులు తీసుకుని.. కట్టకుండా పారిపోతుంటాడని ఆయన అన్నారు. మంగళవారం జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన జైరాంరమేశ్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అస్సాం, జార్ఖండ్ లాంటి చాలా రాష్ట్రాల్లో నామా ప్రాజెక్టులు కట్టకుండా పారిపోయాడని ఎద్దేవా చేశారు. జార్ఖండ్‌లో హైవే నిర్మాణం కోసం తానే చాలా సార్లు నామాకు ఫోన్‌చేశానని, 10 రోజుల క్రితం కూడా ఫోన్ చేసి హైవే పని పూర్తిచేయాలని కోరానని, అయినా నామా ప్రాజెక్టులు కట్టడని అన్నారు. జిల్లాలోని బయ్యారం ఇనుప ఖనిజాన్ని ఉక్కుగా చేసేందుకు స్టీలు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరునెలల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను తయారుచేస్తామని, ఆ తర్వాత పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుతో జిల్లాలోని యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులయ్యే జిల్లాకు చెందిన 45వేల కుటుంబాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని చెప్పారు. బలవంతంగా ఎవరిని ఒక ప్రాంతం నుంచి తరలించబోమని, అందరి ఆమోదం మేరకు పునరావాసం కల్పిస్తామని చెప్పారు. వీరందరికీ నూతన పాలసీ ప్రకారం పునరావాసం కల్పించే బాధ్యతను కేంద్రమే తీసుకుంటుందని చెప్పారు. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని కొన్ని గ్రామాలను సీమాంధ్రలో కలిపామని, అయితే, 1959కి ముందు కూడా భద్రాచలం డివిజన్ కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండేదని, ఇప్పుడు తాము కొత్తగా చేస్తున్నదేమీ లేదని అన్నారు. పోలవరం కారణంగా ఖమ్మం జిల్లాలో ముంపునకు గురయ్యే ప్రాంతాలకు సంబంధించి గ్రామాలను సీమాంధ్రలో కలిపే అంశం మాత్రమే బిల్లులో ఉందని, కానీ మండలాలను కలిపే అంశంలో మాత్రం ఆర్డినెన్స్ తీసుకురావాల్సి ఉందని, కేంద్రంలో ఏర్పడబోయే నూతన ప్రభుత్వం దీనిని తీసుకువస్తుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలసంఘం క్లియర్చేసిందని, ఈ ప్రాజెక్టు డిజైన్ మార్పు చేసే అంశం సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినదని అన్నారు. తెలంగాణ ఏర్పాటయిన తర్వాత ఖమ్మం జిల్లాలో మైనింగ్ యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు మాట్లాడుతూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ యువతకు ఓ స్వప్నాన్ని ఆవిష్కరించారని, ఆ స్వప్నం ఖమ్మం నుంచే ప్రారంభమవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ లాగే బీసీలకు, మైనార్టీలకు కూడా సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, ఖమ్మం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా పార్టీ ఇన్చార్జి జెట్టి కుసుమకుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి లోకేశ్‌యాదవ్, జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు పరుచూరి మురళీ కష్ణ, వీవీ అప్పారావు, పులిపాటి వెంకయ్య పాల్గొన్నారు. -
పోలవరం టెండర్లకు లైన్ క్లియర్
-
పోలవరం టెండర్లకు లైన్ క్లియర్
హైదరాబాద్ : హైకోర్టులో ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి ఊరట లభించింది. పోలవరం ప్రాజెక్ట్ టెండర్ల విషయంలో దాఖలైన రిట్ పిటిషన్లను హైకోర్టు బుధవారం కొట్టేసింది. దాంతో పోలవరం ప్రాజెక్ట్ టెండర్లకు లైన్ క్లియరైంది. ట్రాన్స్ట్రాయ్ సంస్థకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన న్యాయస్థానం సోమా, మధుకాన్, మహాలక్ష్మీ పిటిషన్లను కొట్టివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ సమయంలో టెండర్ల విషయంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.