సాక్షి, హైదరాబాద్: ఎన్‌హెచ్–33 పనుల కోసం తీసుకున్న రుణంలో కొంత భాగం పక్కదారి పట్టించిన కేసులో టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావుకు చెందిన మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులనే బురిడీ కొట్టించాలని చూసింది. తమ కాంట్రాక్టును పూర్తి చేయడానికి సబ్ కాంట్రాక్టుల సాయం తీసుకొని వాళ్లకు డబ్బులు చెల్లించామని కొన్ని లేఖలు ఈడీకి అందించింది. అలా సబ్ కాంట్రాక్టులు ఇచ్చామని చెప్పిన సంస్థల్లో ఓ ఉత్తరప్రదేశ్ కంపెనీ యజమానిని ఈడీ అధికారులు పిలిచి లేఖలు చూపించగా అవన్నీ నకిలీవని తేలింది. దీనిపై ఆ సంస్థ యజమాని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మధుకాన్ కంపెనీస్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
రూ.1,151 కోట్ల రుణం తీసుకొని..
జార్ఖండ్‌లో రాంచీ–రార్‌గావ్–జంషెడ్‌పూర్ మధ్య 163 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి–33 పనులను మధుకాన్ సంస్థ దక్కించుకుంది. రూ.1,151 కోట్ల వ్యయంతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (బీవోటీ) పద్ధతిలో దీన్ని వశం చేసుకుంది. ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్ కింద రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నుంచి దక్కించుకున్న టెండర్‌ను చూపించి కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,029.39 కోట్లు రుణంగా పొందింది. మధుకాన్ తీసుకున్న రుణం నుంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం జార్ఖండ్ హైకోర్టుకు చేరడంతో దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ కేంద్రంగా పని చేసే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ)ను ఆదేశించింది. ఈ శాఖ దర్యాప్తులో రూ.264.01 కోట్లను మధుకాన్ సంస్థ పక్కదారి పట్టించినట్లు తేలింది. దీంతో బ్యాంకు కన్సార్టియం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న కె. శ్రీనివాసరావు, ఎన్. సీతయ్య, ఎన్. పృథ్వీతేజను నిందితులుగా పేర్కొంటూ 2019లో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఆ తర్వాతి ఏడాది న్యాయస్థానంలో అభియోగపత్రాలను దాఖలు చేసింది.
మనీల్యాండరింగ్ జరిగినట్టు గుర్తించి..
సీబీఐ అభియోగపత్రాల ఆధారంగా ఈ వ్యవహారంలో భారీ స్థాయిలో మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ అధికారులు మరో కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. గతేడాది జూన్‌లో నామా నివాసం, కంపెనీల్లో సోదాలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నం.19లో ఉన్న నామా నాగేశ్వర్‌రావు ఇల్లు, రోడ్ నం.36లో ఉన్న మధుకాన్ కంపెనీ, రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ డైరెక్టర్ల ఇళ్లు కలిపి 6 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ విచారణకు హాజరైన పలువురు మధుకాన్, రాంచీ ఎక్స్‌ప్రెస్ వే సంస్థల ప్రతినిధులు నిధుల చెల్లింపు విషయమై కొన్ని పత్రాలను ఈడీ అధికారులకు సమర్పించారు.
రోడ్ కాంట్రాక్టు పూర్తి చేయడానికి చాలా సబ్ కాంట్రాక్టుల సాయం తీసుకున్నామని, వారికి చెల్లింపులు జరిపామని వాటిలో పేర్కొన్నారు. సబ్ కాంట్రాక్టర్లు చెల్లింపులు జరిగినట్లు ఇచ్చిన లేఖలను ఈడీ అధికారులకు అందించారు. ఆ లేఖల ఆధారంగా సబ్ కాంట్రాక్టర్లను ఈడీ అధికారులు పిలిచి విచారించారు. మధుకాన్ వద్ద రాంచీ–రార్‌గావ్–జంషెడ్‌పూర్ జాతీయ రహదారి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థల్లో ఉత్తరప్రదేశ్‌లోని మధుపూర్‌కు చెందిన డీఆర్ విజన్స్ ఒకటి. సదరు ఎక్స్‌ప్రెస్ వేలో 114 కిలోమీటర్ నుంచి 277 కిలోమీటర్ వరకు ఎర్త్‌వర్క్‌ను ఈ సంస్థ నిర్వర్తించింది.
దీంతో ఈడీ ఇటీవల బీఆర్ విజన్స్ యజమాని రామ్‌సాయి సింగ్‌ను విచారణకు పిలిచింది. ఆ లేఖలను చూసి అవాక్కయిన ఆయన ఆ లేఖలతో తనకు కానీ, తమ ప్రతినిధులకు కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ రెండు లేఖల ద్వారా మధుకాన్ సంస్థ బ్యాంకులతో పాటు ఇతర సంస్థలకు రూ.18 కోట్లు నష్టం వాటిల్లేలా వ్యవహరించిందని చెప్పారు. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో (సీసీఎస్) ఫిర్యాదు చేశారు. ప్రాథమిక పరిశీలన తర్వాత మధుకాన్ సంస్థపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో కొన్ని ఆ«ధారాలు సేకరించాక మధుకాన్ సంస్థతో పాటు బాధ్యులకు నోటీసులు జారీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment