ఐ... లాస్ట్... యూ!
ఫేమస్ టూన్
ఇరాన్ ప్రభుత్వం పత్రికలపై విధిస్తున్న కనిపించీ కనిపించని సెన్సార్షిప్ మీద టెహ్రాన్ కార్టూనిస్ట్ బొజర్గమేర్ పదునైన కార్టూన్లు గీశారు. గత రెండు దశాబ్దాలుగా ఇరాన్ దినపత్రికలలో విరివిగా కార్టూన్స్ గీస్తున్న ఈ కార్టూనిస్ట్ గీత, రాత రెండూ బాగుంటాయి.
‘‘మనం గీసిన దానిలో బొమ్మ కనిపించడం కాదు... మనం ఏం చెప్పదలుచుకున్నామో అది కనిపించాలి’’ అంటాడు బొజర్గమేర్. నిజమే. రాత లేక పోయినా సరే, ఆయన గీతలో స్పష్టత ఉంటుంది.
పొలిటికల్ కార్టూన్లు మాత్రమే కాదు... మానవ సంబంధాల్లోని భావోద్వేగాలను, ప్రేమను ఆయన బలంగా చిత్రించారు. కింద మీరు చూస్తున్న కార్టూన్ ఈ కోవకు చెందినదే. ఒక తోటలో రెండు పూలు చాలా స్నేహంగా ఉండేవి. చిరుగాలి సితార సంగీతమై వినిపిస్తున్న ఒక రోజు ‘ఐ లవ్ యూ’ చెప్పింది ఒక పువ్వు మరొక పువ్వుకు. ఈ క్షణం కోసమే ఎన్నో యుగాల నుంచి ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నాయి ఆ పూల కళ్లు. వాటి మౌనభాషలో... ఎన్ని మధురభావాలో!
ఇంతలో ఒక హస్తం క్రూరంగా ‘ఐ లవ్ యూ’ చెప్పిన పువ్వును పెరికేసింది. ఆ చేయి తన ప్రియురాలి చేతికి ఆ పువ్వును ఇచ్చి ‘ఐ లవ్ యూ’ చెప్పింది. ప్రియురాలి కళ్లలో ఆనందబాష్పాలు. పువ్వు మనసులో విషాద సాగరాలు!
చిరుగాలి పెనుతుఫాను అయింది. పువ్వు ప్రియురాలు నిర్జీవమైపోయింది!! బొజర్గమేర్ కార్టూన్ స్ట్రిప్‌ను చూస్తే ఇలాంటి కథలు ఎన్నయినా ఊహల్లోకి రావచ్చు. ప్రేమకు ఉండే అనేక కోణాలను గుర్తుకు తెచ్చే కార్టూన్ ఇది.
పూలకూ ఒక మనసు ఉందనేది భావుకత కాదు... శాస్త్రీయ నిజం. అంటే మన ప్రేమ కోసం పూబాలల మనసు నొప్పిస్తున్నామా? ఛ!