అభివృద్ధి తోడుంటే ఆధిక్యం మీ వెంటే
స్పష్టం చేస్తున్న మాదీపూర్ ప్రజలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రసవత్తంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నాయకులు, ప్రజలు అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. అలాగే మాదీపూర్ నియోజకవర్గ అభ్యర్థుల విజయం కూడా అభివృద్ధి చుట్టే తిరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ 15 ఏళ్ల పాలనలో ఈ నియోజకవర్గం కనీస వసతులకు కూడా నోచుకోలేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న నియోజకవర్గ జనం 2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీలు హోరాహోరాగా తలపడినా, అంతిమంగా స్వల్ప(1,100 ఓట్లు) మెజార్టీతో ఆప్ అభ్యర్థి గట్టెక్కారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీల మధ్యే గట్టి పోటీ నెలకొంది.
మాజీ మంత్రి గట్టెక్కేనా
సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర పారిశ్రామిక మాజీ మంత్రి గిరీష్ సోనీయే మళ్లీ ఆప్ నుంచి బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 2013లో ఘోరంగా ఓడిపోయిన రామ్ గాంగ్వాల్ మరో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీజేపీ ఈ సారి వ్యూహాత్మకంగా కొత్త అభ్యర్థి రాజ్‌కుమార్ ఫుల్వారియాను రంగంలోకి దింపింది. క్రితం స్వల్ప తేడాతో ఓడిన బీజేపీ ఈ సారి కచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో ఉంది. ‘సోని నియోజకవర్గంలో చురుకుగా పని చేశారు. కానీ వాస్తవానికి మంత్రి ఆప్‌కు బలోపేతానికే పాటుపడ్డారు’ అని రఘవీర్ నగర్‌కి చెందిన కేశవ్ అనే వ్యక్తి అభిప్రాయపడ్డారు.
అనధికార కాలనీల పునరుద్ధరణ కలిసొచ్చేనా
ఎన్నికల్లో ఆప్, బీజేపీల మధ్యే పోటీ ఉంటోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రోడ్లు, బస్తీలు, అనధికార కాలనీల పునరుద్ధరణ వంటి పనులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆ పార్టీలు భావిస్తున్నాయని వివరిస్తున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 44 కాలనీలను పునరుద్ధరించిన విషయాన్ని బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి.
ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రజలు ఎంతో ఉపశమనం పొందారని వివరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ...గాంగ్వాల్కే మళ్లీ అవకాశమిచ్చింది. కానీ ఆయన ఇప్పటికీ ప్రజల్లో మమేకం కాలేకపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. మోదీ కరిష్మాకు పరీక్ష, ఆప్‌కు జీవన్మరణ సమస్య, కాంగ్రెస్ ‘ఇజ్జత్ కా సవాల్’ అయిన ప్రస్తుత ఎన్నికల్లో ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరివైపు నిలుస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు.