జబ్బు నయం అయ్యేందుకు నరబలి
బాలిక హత్యకేసులో నిందితుల అరెస్ట్
బెంగళూరు :
కర్ణాటకలోని మాగడి వద్ద చోటుచేసుకున్న నరబలి ఘటన మిస్టరీ వీడింది. పక్షవాతం బారిన పడిన వ్యక్తి కోలుకునేందుకు నిందితులు అభం శుభం తెలియని బాలికను నరబలి ఇచ్చారు. ఈమేరకు మాగడికి చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్వాసిల్, నజీమ్తాజ్, రషీదున్నిసాను అరెస్ట్ చేసిన మాగడి పోలీసులు..ఇదే కేసుకు సంబంధించి మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు.. మహమ్మద్ వాసిల్ కుటుంబ సభ్యుల్లో ఒకరు పక్షవాతంతో బాధపడుతున్నారు. ఎన్ని చోట్ల వైద్యులకు చూపించినా నయం కాలేదు. దీంతో మూఢనమ్మకాలను ఆశ్రయించాడు. బాలికను నరబలి ఇస్తే పక్షవాతం నయమవుతుందంటూ ఎవరో చెప్పిన మాటలను నమ్మి తన సంబంధీకులతో కలసి చర్చించాడు. ఈమేరకు నరబలి ఇవ్వడానికి బాలిక కోసం అన్వేషణ సాగించారు. ఈ క్రమంలో మాగడిలో కిరాణదుకాణం నిర్వహిస్తున్న మహమ్మద్ నూరుల్లా కుమార్తె ఆయేషాపై నిందితుల కన్ను పడింది. ఈనెల 1న ఆయేషా ఒంటరిగా స్నేహితుల ఇంటికి వెళుతుండగా నిందితులు... ఆ బాలికను అపహరించి క్షుద్రపూజలు చేశారు. అనంతరం నరబలి ఇచ్చి మృతదేహాన్ని సమీపంలోని చెరువులో విసిరేసి పారిపోయారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇదే కేసుకు సంబంధించి మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.