
కోర్టులో లొంగిపోయిన ఎమ్మెల్యే బాలకృష్ణ
బెంగళూరు : మాగడి తాలూకాలోని కూదూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ, సీఐలను అసభ్యపదజాలాలతో దూషించిన కేసులో మాగడి ఎంఎల్‌ఏ బాలకృష్ణ శుక్రవారం మాగడిలోని ఒకటవ జేఎంఎఫ్‌సీ కోర్టులో లొంగిపోయారు. వివరాలు..తాలూకాలోని అయ్యండనహళ్లిలో ఇటీవల జరిగిన జాతరలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘటనలో తమ పార్టీకి చెందిన వారిపై దాడులకు పాల్పడ్డ వ్యక్తులను అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సదరు ఎమ్మెల్యే ఎస్‌ఐ, సీఐలను బుధవారం అసభ్యపదజాలాలతో దూషించినట్లు ఆరోపణలున్నాయి.
ఈ మేరకు కూదురు సీఐ నందీశ్ జిల్లా ఎస్పీ రమేశ్‌కు ఫిర్యాదు చేశాడు. దీనికితోడు ఎంఎల్‌ఏ బాలకృష్ణ పోలీసు అధికారులను దూషిస్తున్న దృశ్యాలు ప్రసారమాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. దీంతో ఎస్పీరమేశ్ ఎమ్మెల్యే బాలకృష్ణపై కూదురు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తనను అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారన్న విషయం తెలుసుకున్న బాలకృష్ణ తన లాయర్‌తో కలసి శుక్రవారం మాగడిలోని జేఎంఎఫ్‌సీ కోర్టులో లొంగిపోయారు.