Maganti Srinath
-
మా కష్టమంతా మర్చిపోయాం
‘‘ఆంధ్రా ప్రజలకు పెరుగన్నం, ఆవకాయతో తినడం ఇష్టం. తెలంగాణ వాళ్లకు ధమ్ బిర్యానీ తింటే సంతృప్తి. ‘బిలాల్పూర్ పోలీస్‌స్టేషన్’ చూస్తే అలాంటి సంతోషమే ప్రేక్షకులకు దక్కుతుంది’’ అని మహంకాళి శ్రీనివాస్ అన్నారు. మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘనా జంటగా నాగసాయి మాకం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’. మహంకాళి శ్రీనివాస్ నిర్మాత. కవి గోరటి వెంకన్న కీలక పాత్ర పోషించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘మా చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. తొలి చిత్రానికే విజయం దక్కడం నిర్మాతగా మరిన్ని సినిమాలు చేయడానికి ప్రోత్సాహం ఇచ్చింది’’ అన్నారు. ‘‘ఫస్ట్ షో చూస్తుంటే సినిమాకు పడ్డ కష్టం అంతా మర్చిపోయాం. సినిమా బావుంటే నటీనటులు కొత్తా పాతా అని ఉండదని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు’’ అన్నారు నాగసాయి. ‘‘ఎలాంటి అశ్లీలత, హింస మా చిత్రంలో లేదు. నేను రాసిన పాటలను అందరూ ఆనందించారు. తాజాగా నేను నటించిన ఈ చిత్రాన్ని కూడా ఆనందిస్తున్నారు’’ అని గోరటి వెంకన్న అన్నారు. ఈ వేడుకలో శ్రీనాథ్, శాన్వీ, సంగీత దర్శకుడు సాబూ వర్గీస్, మౌన శ్రీ మల్లిక్ పాల్గొన్నారు. -
నా విషయంలో రివర్స్ అయింది
‘‘నాన్నా నేను సినిమాల్లోకెళ్తా’ అని తల్లిదండ్రులను అడగటం ఎవరి విషయంలో అయినా కామన్‌గా జరిగేదే. కానీ నా విషయంలో మాత్రం రివర్స్‌లో జరిగింది. ‘నానా.. సినిమాల్లోకి వెళ్తావా?’ అని మా నాన్నగారే అడిగారు. నాకూ సినిమాల మీద ఆసక్తి ఉండటంతో సినిమాల్లోకి వచ్చాను’’ అన్నారు మాగంటి శ్రీనాథ్. అతను నటించిన లేటెస్ట్ చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్. మహంకాళి శ్రీనివాస్ నిర్మాణంలో నాగసాయి మాకం దర్శకత్వం వహించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సంపాదించింది. అలాగే థియేటర్స్ సంఖ్య కూడా పెరిగిందన్నారు మాగంటి శ్రీనాథ్. ఈ సందర్భంగా శ్రీనాథ్ చెప్పిన విశేషాలు. ► ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’ రెస్పాన్స్ గురించి? చాలా బావుంది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్ కూడా పెంచుతున్నామంటే అర్థం చేసుకోవచ్చు. టీమ్ అంతా హ్యాపీగా ఉన్నాం. కథ బాగుందని చూసినవాళ్లు అంటున్నారు. ఒక ఊర్లో ఓ పోలీస్‌స్టేషన్. అక్కడ నమోదయ్యే గమ్మతు కేసులు ఆధారంగా ఈ కథ నడుస్తుంది. మా సినిమాలో చేసిన హీరోయిన్ తెలుగమ్మాయి. తను ‘సైరా’లో ఓ పాత్ర చేసింది. ‘ఎదురీత’లో చేసింది. ► ఇందులో చేసిన పోలీస్ పాత్రకు శిక్షణ ఏమైనా? లేదు. ఎన్సీసీలో నాకు ఏ, బి సర్టిఫికేట్లు ఉన్నాయి. మా అమ్మగారు గవర్నమెంట్ స్కూల్ టీచర్. ఆమె స్టూడెంట్స్‌లో కొంత మంది పోలీస్‌లు ఉన్నారు. వాళ్ల ఇన్పుట్స్ ఉపయోగపడ్డాయి. పోలీస్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, వెపన్స్‌ను ఎలా హ్యాండిల్ చేయాలనేవి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ► హీరో అవ్వాలనే ఆలోచన ఎప్పుడు మొదలైంది? నేను మెకానికల్ ఇంజనీర్ని. కాలేజ్ టైమ్‌లో టీచర్స్ చెప్పిన కాన్సెప్ట్‌లు అర్థం కానప్పుడు ఆ సినిమాలో నేను హీరో అయితే ఏంటి? ఇక్కడ నేనుంటే ఇలా చేసేవాణ్ణి అన్నట్టుగా ఆలోచించేవాణ్ణి. బయటకు మాత్రం బుద్ధిగా క్లాస్ వింటున్నట్టు కనిపించేవాణ్ణి. కాలేజ్ పూర్తయ్యాక నాన్నగారి బిజినెస్‌ను టేకప్ చేశాను. ఓ రోజు నాన్నే సడన్‌గా ‘సినిమాల్లో హీరోగా చేయి’ అన్నారు. నాకూ ఇంట్రస్ట్ కాబట్టి వెంటనే ‘యస్’ అన్నాను. సత్యానంద్‌గారి వద్ద శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత ‘ఇదేం దెయ్యం’ అనే సినిమాలో నటించాను. ► ప్రస్తుతం ఏం సినిమాలు చేస్తున్నారు? ‘సమయం’ రిలీజ్‌కు రెడీ అయింది. నితిన్‌తో ‘ద్రోణ’ తీసిన కుమార్‌గారితో ఓ మూవీ చేశా. ► డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? రైతులా నటించాలనుంది. మన దేశానికి రైతే వెన్నెముక. కానీ అలాంటి రైతుల పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు. రైతుల ఎమోషన్స్‌తో కూడుకున్న కథ వస్తే కచ్చితంగా చేస్తాను. అన్ని రకాల సినిమాలు చేసి, నటుడిగా నిరూపించుకోవాలని ఉంది. -
నటనపై గౌరవం పెరిగింది
‘‘నటనలో నాకు పెద్దగా అనుభవం లేదు. ‘బతుకమ్మ’ సినిమా అప్పుడు ఇటీవల మరణించిన దీక్షితులుగారు మూడు రోజులు శిక్షణ ఇచ్చారు. అలాగే నాటకరంగంలో ఉన్న ప్రవేశం కూడా సహాయపడింది. ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’ చిత్రంలో ఫుల్‌లెంగ్త్ పాత్ర చేసిన తర్వాత నటనపై చాలా గౌరవం పెరిగింది’’ అన్నారు రచయిత, గాయకులు గోరటి వెంకన్న. మాగంటి శ్రీనాథ్ హీరోగా మాకం నాగసాయి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’. మహంకాళీ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలకానుంది. ఈ సందర్భంగా గోరటి వెంకన్న మాట్లాడుతూ– ‘‘నిర్మాత శ్రీనివాస్, సాయి బాగా తెలుసు. అందుకే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి, హెడ్ కానిస్టేబుల్ సురేందర్ పాత్రలో నటించాను. అరుణయ్య అనే మిత్రుడు కానిస్టేబుల్ నుంచి ఎస్సై స్థాయికి చేరుకున్నారు. నాకు ఆయనే గుర్తుకొచ్చారు. ఆ పాత్రనే వేశాను అనిపించింది. టీమ్ అందరూ ప్రోత్సహించారు. ఓ సీన్లో భాగంగా నన్ను ఏడవమన్నారు. గ్లిజరిన్ లేకుండా పదిసార్లు ఏడ్చాను. ఆ సీన్ బాగా పండింది. దృశ్య మాద్యమం చాలా శక్తివంతమైనది. ఎవరైనా పాత్రలు చేయమని ప్రేమతో అడిగితే చేస్తాను. పాత్రల కోసం పని కట్టుకుని పోను. ప్రేమ గీతాలు రాశాను. మనసు చంపుకుని ఓ స్పెషల్ సాంగ్ కూడా రాశాను. ‘దొరసాని’, ‘సంత’, ‘మల్లేశం’, ‘నేనే..సరోజ’, ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ చిత్రాలకు పాటలు రాశాను. కొన్ని పెద్ద సినిమాల్లో పాత్రలు చేసే అవకాశాలు వచ్చాయి. వద్దనుకున్నాను’’ అని చెప్పుకొచ్చారు. -
ఆ కష్టాలు సినిమా వాళ్లకే తెలుసు
‘‘మా శ్రీనివాస్ వ్యాపార రంగంలో ఉన్నారు. సినిమాలకు కొత్త అయినప్పటికీ మంచి చిత్రాన్ని రూపొందించారు. మనకు పైకి కనిపించే సినిమా రంగులమయంగా ఉంటుంది. కానీ, దానిలో కష్టాలు సినిమా చేసే వాళ్లకే తెలుస్తాయి. ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’ చిత్రంలో మా పాలమూరు జిల్లాకు చెందిన వాళ్లే ఉండటం సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయవంతం కావాలి’’ అని మాజీ మంత్రి డి.కె. అరుణ అన్నారు. మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘనా జంటగా నాగసాయి మాకం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’. ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళీ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుదలవుతోంది. సాబూ వర్గీస్ సంగీతం అందించిన పాటలను డి.కె. అరుణ విడుదల చేశారు. ‘‘చిన్నప్పటి నుంచి నాకు కళలపై ఆసక్తి. కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో దర్శకుణ్ణి అవుదామని కృష్ణానగర్ వచ్చాను. చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ల కష్టాలు చూసి ఇక్కడ మనం ఉండలేం అని తిరిగి వెళ్లిపోయాను. వ్యాపారంలో స్థిరపడ్డాను. ఆనాటి నా ఆకాంక్షని ఈరోజు నిర్మాతగా మారి సినిమా చేశాను’’ అన్నారు మహంకాళీ శ్రీనివాస్. ‘‘నాకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి పెద్దగా ఉండదు. మహంకాళీ శ్రీనివాస్ విలువలు తెలిసిన వ్యక్తి. అందుకే ఈ చిత్రంలో నటించాను’’ అని పాటల రచయిత గోరటి వెంకన్న అన్నారు. ‘‘ఆద్యంతం సహజంగా సాగే కథాకథనాలతో మా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సందేశాత్మకంగా ఉన్నా వాణిజ్య అంశాలకు0 ఎక్కడా లోటుండదు’’ అన్నారు నాగసాయి మాకం. మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘన, సంగీత దర్శకుడు సాబూ వర్గీస్, పాటల రచయిత మౌన శ్రీ మల్లిక్, సినిమాటోగ్రాఫర్ తోట వి. రమణ తదితరులు పాల్గొన్నారు. -
నవ్వులు పంచే పోలీస్ స్టేషన్
మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా, గోరేటి వెంకన్న కీలక పాత్రలో నటించిన చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’. నాగసాయి మాకం దర్శకత్వంలో ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళీ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా మార్చి రెండో వారంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మహంకాళీ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్యను ఇందులో చూపించాం. తప్పకుండా ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమా అవుతుంది. మంచి కథకు నిర్మాణ విలువలు తోడైతేనే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పెద్ద నిర్మాణ సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా మా సినిమా ఉంటుంది. మార్చి రెండో వారంలో ఓ పెద్ద పంపిణీ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘బిలాల్పూర్ అనే ఊరి పోలీస్ స్టేషన్‌కు వచ్చే వింత వింత కేసులు కడుపుబ్బా నవ్విస్తాయి. కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకునే సినిమా ఇది. ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేకుండా తెరకెక్కించాం. సినిమా చూస్తున్న వాళ్లకు తమ ఊరిలో జరిగే సంఘటనలు గుర్తొస్తాయి’’ అని నాగసాయి మాకం అన్నారు. ప్రణవి, ఆర్ఎస్ నందా, వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: తోట వి. రమణ, సంగీతం: సాబూ వర్గీస్. -
ప్రేక్షకులను నిరాశపరచదు
‘‘వాస్తవ కథలతో సహజత్వం ఉట్టిపడేలా సినిమాలు నిర్మించాలంటే ధైర్యం ఉండాలి. ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’ చిత్రంతో నిర్మాత మహంకాళి శ్రీనివాస్ అలాంటి సాహసం చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశప రచదు’’ అని డైరెక్టర్ ఎన్. శంకర్ అన్నారు. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా గోరేటి వెంకన్న కీలక పాత్రలో నాగసాయి మాకం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’. మహంకాళి శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని ఎన్.శంకర్ విడుదల చేశారు. మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘సినిమా కథలు మన జీవితాల్లో నుంచే పుడతాయి. ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’ కథ మన చుట్టూ ఉన్న ప్రజలను దగ్గర నుంచి చూసిన స్ఫూర్తితో రాసుకున్నాను. ఈ నెల రెండో వారంలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఒక ఊరిలోని పోలీస్ స్టేషన్‌కు ఎలాంటి వింత కేసులు వస్తాయన్నదే ఈ చిత్ర కథాంశం. సరదాగా, సందేశాత్మకంగా ఉంటుంది’’ అన్నారు నాగసాయి మాకం. -
తెలుగు సినిమాని కొత్త దారిలో తీసుకెళుతుంది
ఎం.ఎస్.క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్‌స్టేషన్’. మాగంటి శ్రీనాథ్, మేఘన జంటగా నటించారు. నాగసాయి మాకం దర్శకుడు. ఈ చిత్రం కోసం గోరేటి వెంకన్న పాడిన ప్రచార గీతాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాగసాయి మాట్లాడుతూ – ‘‘దాదాపు 200 పోలీస్ స్టేషన్లలకు వెళ్లి అక్కడి కేసులను పరిశీలించి కథను తయారు చేసుకున్నాను. సినిమాకి పనికొచ్చే కేసులను కథలో చేర్చాం. ఈ కేసులన్నీ వినోదాత్మకంగానే ఉంటాయి. సినిమా అంతా గ్రామీణ నేపథ్యంలోనే సాగుతుంది’’ అన్నారు. మహంకాళీ శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘నేనీ చిత్రాన్ని ప్యాషన్ కోసం చేయలేదు. వ్యాపారం కోసమే చేశాను. పెట్టిన డబ్బు తిరిగి రాకపోతే ప్యాషన్ ఉండి ఏం లాభం. ఈ సినిమాను కొత్త తరహా కథ, కథనాలతో తెరకెక్కించాం’’ అన్నారు. సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ – ‘‘సాహిత్యానికి చిన్నా పెద్దా తేడా లేదని దాసరిగారు నాతో చెప్పేవారు. చిన్న హీరోకు పాట రాసినా సూపర్ స్టార్‌కు రాసినట్లే భావించి రాయాలని చెప్పేవారు. అలాగే ఈ చిత్రంలో మంచి పాట రాశాను. మనసు పెట్టి రచించాను’’ అన్నారు. గోరేటి వెంకన్న మాట్లాడుతూ – ‘‘నాకు గాయకునిగా, గీత రచయితగానే కాకుండా నటునిగా ఈ చిత్రంలో అవకాశం కల్పించారు దర్శక,నిర్మాతలు. ప్రాధాన్యమున్న పాత్రలో నటించాను. కావాల్సినంత వినోదం ఉంటుంది. ‘బిలాల్పూర్ పోలీస్‌స్టేషన్ ’ తెలుగు సినిమాను కొత్తదారిలో తీసుకెళ్లే చిత్రమవుతుంది’ అన్నారు. -
సహజమైన కథ
శ్రీనాథ్ మాగంటి, మేఘన జంటగా నాగసాయి మాకం దర్శకత్వంలో ఎమ్ఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాసులు నిర్మించిన సినిమా ‘బిలాల్పూర్ పోలీస్‌స్టేషన్’. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘‘పోలీస్‌స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే వినూత్నమైన చిత్రం ఇది. ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. కథ మీద నమ్మకంతో దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా ఉన్నత నిర్మాణ విలువలతో చిత్రాన్ని నిర్మించాం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రీనివాసులు. ‘‘వాస్తవ సంఘటనలతో అల్లుకున్న పూర్తి సహజమైన కథ ఇది. ప్రజా కవి గోరటి వెంకన్న ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. కామెడీ సన్నివేశాలు టైమింగ్‌కు తగ్గట్లుగా ఉంటాయి. సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు నాగసాయి. ఈ సినిమాకు సంగీతం: సాబూ వర్గీస్. -
బిలాల్పూర్లో...
శ్రీనాథ్ మాగంటి, మేఘన జంటగా నాగసాయి మక్కం దర్శకత్వంలో మహంకాళి శ్రీనివాసులు నిర్మిస్తున్న చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్‌స్టేషన్’. జగ్గిలొల్లి అనేది ఉపశీర్షిక. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ‘‘బిలాల్పూర్ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగే ఈ కథలో లవ్, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సమతూకంగా ఉంటాయి. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో అల్లుకున్న కథ ఇది. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది’’ అన్నారు నాగసాయి. ‘‘పోలీస్ నేపథ్యంలో వచ్చే ఫార్ములా సినిమాలకు మా చిత్రం భిన్నంగా ఉంటుంది. ఇలాంటి కథను ఇంత వరకు స్క్రీన్‌పై చూసి ఉండరు’’అన్నారు శ్రీనివాసులు. -
భయపడే దెయ్యం
ఏ.వి రమణమూర్తి సమర్పణలో చిన్మయానంద ఫిల్మ్స్ పతాకంపై ఎస్. సరిత నిర్మిస్తోన్న చిత్రం ఇదేం దెయ్యం. శ్రీనాధ్ మాగంటి హీరోగా పరిచయం అవుతున్నాడు. సాక్షి కక్కర్, రచన స్మిత్, రుచి పాండే నాయికలు. రచ్చ రవి, కిరాక్ ఆర్.పి కీలక పాత్రధారులు. వి. రవివర్మ దర్శకత్వం వహించగా, బాలు స్వామి సంగీతం అందించారు. అన్ని పనులు పూర్తిచేసుకుని ఈనెల 4న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర హీరో మాగంటి శ్రీనాద్ మాట్లాడుతూ, 'హాస్యానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కించిన సినిమా ఇది. భయపడే సన్నివేశాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. కానీ ఆ కష్టాలు థియేటర్ కు వచ్చిన ఆడియన్స్ ను నవ్విస్తాయి. ముఖ్యంగా రచ్చ రవి, ఆర్ పి తో నా కాంబినేషన్ సీన్స్ బాగుంటాయి. ప్రేక్షకులంతా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం' అన్నారు. చిత్ర దర్శకుడు రవి వర్మ మాట్లాడుతూ, ` రచ్చరవి, ఆర్.పి, శ్రీనాధ్ ను దృష్టిల్లో పెట్టుకుని కథ రాసుకున్నా. నేను అనుకున్న దానికన్నా బాగా నటించారు. శ్రీనాధ్ కొత్త కుర్రాడైనా చాలా బాగా నటించాడు. కామెడీ హైలైట్ గా ఉంటుంది. హారర్ సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేస్తాయి. సినిమా చూసిన వాళ్లంతా బాగా ఎంజాయ్ చేస్తారు. మాకు మంచి డిస్ర్టిబ్యూటర్స్ దొరికారు. ఏపీ, తెలంగాణ రాష్ర్టాలలో మొత్తం 100 థియేటర్లలలో సినిమా రిలీజ్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులంతా తప్పకుండా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్న'మని తెలిపారు.