రైవస్ కాలువలో గల్లంతైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతదేహం లభ్యం
కంకిపాడు, న్యూస్‌లైన్ : ఉప్పులూరు వద్ద రైవస్ కాలువలో గల్లంతైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతదేహం గురువారం లభ్యమైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. విజయవాడ మాచవరం డౌన్ ప్రాంతానికి చెందిన చలసాని గిరిజామణి, ఆమె కుమారుడు మేఘనాధ్, కోడలు సుజాత బుధవారం కారులో కంకిపాడులోని బంధువులు ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి గన్నవరంలోని బంధువుల ఇంటికి బయలు దేరారు.
రాత్రి ఎనిమిది గంటలు దాటాక కారు ఉప్పులూరు రైవస్ కాలువ వంతెన వద్ద వేగంగా వెళుతూ అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో గిరిజామణి(57) అక్కడికక్కడే మృతి చెందగా, కారు నడుపుతున్న మేఘనాధ్(33), గల్లంతయ్యాడు. ప్రమా దం నుంచి సుజాత సురక్షితంగా బయట పడిన విషయం తెలిసిందే. రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయం నుంచి గురువారం ఉదయం 9.30 గం టల వరకూ విస్తృతంగా గాలింపు జరిపారు.
ఎస్సై గుణరాము నేతృత్వంలో సిబ్బంది, ఉప్పులూరు, కంకిపాడు గ్రామాలకు చెందిన పలువురు పల్లెకారులు, ఈతగాళ్లు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఉప్పులూరు మలుపు వద్ద నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతానికి కూత వేటు దూరంలోనే ముళ్లపొదల్లో మేఘనాధ్ మృతదేహం చిక్కుకుని ఉండటా న్ని గుర్తించి వెలికి తీశారు. మృతుల బంధువుల్లో కొందరు అప్పటికే అక్కడ ఉన్నారు. వారు అందించిన సమా చారంతో మిగతా బంధువులు కూడా అక్కడకు చేరుకున్నారు. మేఘనాధ్ మృతదేహాన్ని చూసి తీవ్ర ఆవేదన చెందారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కంకిపాడు ఎస్సై గుణరాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేఘనాధ్ బెంగళూర్‌లో సాఫ్ట్వేర్ ఇం జినీర్‌గా పనిచేస్తున్నాడు. కంచి కచర్లకు చెందిన సుజాతను గత ఆగస్టు 29 న వివాహం చేసుకున్నాడు. భర్త, అత్త ప్రమాదంలో మరణించడంతో నవ వధువైన సుజాత కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. పెళ్లయి రెండు నెలలు కూడా గడవకముందే మేఘనాధ్ మృతిచెందడాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనతో రెండు కుటుంబాలతోపాటు బంధుమి త్రుల్లో విషాదం నెలకొంది.