అక్రమార్కులకు ఎంపీ మాగంటి వత్తాసు
► దేవస్థానం ప్రహరీ కూల్చివేయాలని హుకుం
► కుదరదన్న ఈవో కొండలరావు
► ఎండోమెంటు జేసీకి ఎంపీ ఫోన్
కొల్లేటికోట (కైకలూరు): ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రజాప్రతినిధి ఆయన. అమ్మ దర్శనానికి వస్తున్నా భక్తుల నుంచి నిలువు దోపిడీ చేస్తున్న అక్రమార్కులను అరికట్టాల్సింది పోయి, దోచుకోవడానికి దారి మార్గం కోసం ఎదురుచూస్తున్న వారికి టీడీపీ ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) వత్తాసు పలకడం విమర్శలకు దారితీసింది.
వివరాలు.. జిల్లాలో ప్రసిద్ధి చెందిన కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర సోమవారం ప్రారంభమైంది. ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు హాజరయ్యారు. ఎంపీ వద్దకు సమీపంలో ఇద్దరు దుకాణదారులు మా వ్యాపారాలకు అడ్డుగా దేవస్థాన ప్రహరీ ఉందని, దారి మార్గం కల్పించాలని కోరారు. ముందుగా సిద్ధం చేసుకున్న యాత్రికులను తీసుకొచ్చి ప్రహరీకి గోడ ఉంటే బాగుండదని చెప్పించారు.
దీంతో ఎంపీ దేవస్థానం ఈవో ఆకుల కొండలరావును పిలిచారు. జాతర 15 రోజులు ప్రహరీ కూల్చి దారి ఇవ్వాలన్నారు. ఇది నా పరిధి కాదని, జాయింట్ కమిషనరు అనుమతులు ఉండాలన్నారు. ఎంపీ చెప్పిన చేయరా? అంటూ దేవాదాయశాఖ జాయింట్ కమిషనరు చంద్రశేఖర్ ఆజాద్‌కు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ తీయలేదు. సమీపంలోని కొందరు ఈవో సెల్ నుంచి ఫోన్ చేయండంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. చివరకు ఫోన్ కలవకపోవడంతో మరో సారి మాట్లాడుదామని ఎంపీ వెళ్లిపోయారు.
ప్రహరీ కథ ఇది..: పురాతన కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం 2.10 ఎకరాల్లో విస్తరించి ఉంది. సుమారు ఎకరం స్థలం ఆక్రమణలకు గురయ్యింది. ప్రతి ఆదివారం వచ్చే భక్తులను సమీప కొందరు దుకాణదారులు కొల్లేరు జలగల మాదిరిగా పీడిస్తూ అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. దీంతో సర్వే చేయించి రూ.14 లక్షల 50వేల నిధులతో దేవస్థానం చుట్టూ ప్రహరీ నిర్మించింది. వెనుక నడక మార్గానికి కొంత వదిలారు.
ప్రహరీ వలన అమ్మ దర్శనానికి వచ్చే భక్తులు అక్రమ వసూలు బారి నుంచి తప్పించుకున్నారు. ఇప్పటి వరకు అడ్డేలేదని భావించిన వారికి ఇది మింగుడు పడలేదు. స్థానిక టీడీపీ నేతను ఆశ్రయించారు. ఆయన వచ్చి హడావుడి చేశారు. అది బెడిసి కొట్టడంతో ఇటీవల ఈవోను బెదిరించేందుకు దుకాణదారులు ప్రయత్నించారు. దీంతో ఈవో కైకలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి గుమ్మనంగా ఉన్నఆక్రమణదారులు ఎంపీ మాగంటి రాగానే రెచ్చిపోయారు. కేవలం డబ్బులు దండుకోవడానికి అలవాటు పడిన వ్యాపారులకు ఎంపీ కొమ్ముకాస్తారా? లేదా భక్తుల దోపిడీని అడ్డుకుని ప్రహరీని కాపాడతారా? అని భక్తులు, దేవాలయ సిబ్బంది ఆసక్తిగా చూస్తున్నారు.