విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఎం.తిమ్మాపురం(మహానంది): తిమ్మాపురం గ్రామంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతంలో మృతి చెందాడు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఎం.శ్రీనివాసులు(28) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ప్రభుత్వం ఎస్సీలకు రూ.125కే విద్యుత్ మీటరు అందిస్తుండటంతో విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాడు. గురువారం స్తంభం నుంచి ఇంటికి లాగిన విద్యుత్ తీగకు సపోర్టుగా ఉన్న జీ వైర్ తీగ తెగి కింద పడింది. గమనించిన మూడేళ్ల కుమారుడు ప్రభాస్ ఇంట్లో ఉన్న తండ్రికి చెప్పాడు. ఆయన వచ్చి తీగను పక్కకు తీస్తుండగా అప్పటికే సర్వీసు వైర్‌కు పైన ఉన్న ప్లాస్టింగ్ కోటింగ్ పోయి లోపల ఉన్న తీగలకు జీవైర్ తగిలి విద్యుత్ ప్రసరించడంతో శ్రీనివాసులు విద్యుదాఘాతానికి గురయ్యాడు. తండ్రి పక్కనే ఉన్న ప్రభాస్ కూడా విద్యుత్ ఘాతానికి గురై కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మొదట చిన్నారిని రక్షించారు. శ్రీనివాసులు చేతికి గాయాలౖయె పడిపోయి ఉన్నాడు. అతడిని నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, ఐదేళ్ల హర్ష, మూడేళ్ల కుమారుడు ప్రభాస్ ఉన్నారు. ప్రమాదానికి విద్యుత్ అధికారులు వినియోగించిన నాసిరకం తీగలే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న తహసీల్దార్ రామకృష్ణుడు, విద్యుత్ ఏఈ ప్రభాకర్‌రెడ్డిలు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆపద్బుంధు పథకం కింద ఆర్థిక సహాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు.