నంది వాహనంపై మహాగౌరి
– మహానందిలో వైభవంగా గ్రామోత్సవం
మహానంది: శ్రీ మహాగౌరిదుర్గను పూజించిన వారు సర్వవిధాలా పునీతులై అక్షయంగా పుణ్యఫలాలను పొందుతారని మహానంది దేవస్థానం వేద పండితులు చెండూరి రవిశంకర అవధాని పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మహానంది క్షేత్రంలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారు శనివారం రాత్రి శ్రీ మహాగౌరీదుర్గగా భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్భుజాలను కలిగిన అమ్మవారు ఒక చేతిలో అభయముద్ర, మరొక చేతిలో వరదముద్ర, త్రిశూలం, ఢమరుకాలను ధరించి భక్తులకు దీవెనులు ఇచ్చారు.నందివాహనంపై కొలువైన శ్రీ మహాగౌరీదుర్గ అమ్మవారికి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈఓ శంకర వరప్రసాద్, ఆలయ సూపరింటెండెంట్లు ఈశ్వర్రెడ్డి, పరశురామశాస్త్రి, ఉభయదాతలు పాల్గొన్నారు. కామేశ్వరీదేవి అమ్మవారు ఆదివారం శ్రీ సిద్ధిదాత్రిదుర్గగా భక్తులకు దర్శనమిస్తారు.