Mahajan Socialist Party
-
నేడు మహిళా గర్జన: మంద కృష్ణమాదిగ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించనందుకు నిరసనగా మహాజన సోషలిస్టు పార్టీ, ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్లు సంయుక్తంగా శుక్రవారం మధ్యాహ్నం ఇందిరా పార్కు వద్ద ‘మహిళా గర్జన’ పేరుతో భారీ ఆందోళన కార్యక్రమాన్ని తలపెట్టాయి. సీఎం కేసీఆర్ మంత్రివర్గంలోని 18 మంది మంత్రుల్లో ఒక్క మహిళా మంత్రి లేకపోవడం, గత ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, శాసన మండలి ఎన్నికల్లో నిలబెట్టిన ఐదుగురు అభ్యర్థుల్లో ఒక్క మహిళ కూడా లేక పోవడం, అమరవీరుల తల్లులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించకపోవడానికి నిరసనగా ఈ మహిళా గర్జనను నిర్వహిస్తున్నామని గురువారం ఒక ప్రకటనలో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. కేసీఆర్ తన మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా చేసి రాష్ట్రంలోని రెండు కోట్ల మహిళల సమర్థత, ఆత్మాభిమానాన్ని అవమానించారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంపై సమ్మక్క-సారక్క, చాకలి ఐలమ్మల స్ఫూర్తితో తెలంగాణ మహిళా సమాజం తిరగబడవలసిన సమయం ఆసన్నమైందన్నారు. -
కేసీఆర్ను సీఎంగా వ్యతిరేకించాలి: మందకృష్ణ
హైదరాబాద్ : కేసీఆర్ను సీఎంగా వ్యతిరేకించాలని మహాజన్ సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దళిత సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మందకృష్ణ మాట్లాడుతూ తెలంగాణకు తొలి సీఎం దళితుడేనని పన్నెండేళ్లుగా నమ్మించి మోసం చేసిన కేసీఆర్ వైఖరిని ఎండగట్టారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రశ్నించకపోతే భవిష్యత్లో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో దళితుల పాత్ర ఎంతో ఉందని, ఉద్యమంలో పాల్గొన్న కళాకారుల్లో 90 శాతం వుంది, ఆత్మత్యాగం చేసుకున్న వారిలో 30 శాతం వుంది దళితులేనన్నారు. సమావేశంలో మహాజన సోషలిస్టు పార్టీ ప్రచార కార్యదర్శి రాగటి సత్యం, రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ మాదిగ, మాల మహానాడు నేత ఆగమయ్య, బీఎన్ నరేష్కుమార్, కాశన్న, ధర్మన్న బాబు, లాలయ్య, కె. శంకర్ పాల్గొన్నారు.