కామాంధులకు యావజ్జీవం
సాక్షి, ముంబై: మహాలక్ష్మి శక్తి మిల్లు కాంపౌండ్‌లో గత ఏడాది మహిళా జర్నలిస్టు, టెలిఫోన్ ఆపరేటర్లపై జరిగిన అత్యాచార కేసుల్లో నిందితులైన నలుగురికీ ముంబై సెషన్స్ కోర్టు శుక్రవారం యావజ్జీవ(మరణించేవరకు జైల్లోనే) శిక్షను ఖరారు చేసింది. ఈ కేసుల్లో నిందితులను గురువారమే కోర్టు దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. తుది తీర్పును శుక్రవారం వెలువరించింది. కాగా, టెలిఫోన్ ఆపరేటర్‌పై జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి మాత్రమే కోర్టు శిక్ష ఖరారు చేసింది. మహిళా జర్నలిస్టు కేసులో తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.
కాగా, టెలిఫోన్ ఆపరేటర్ కేసులో నలుగురు నిందితులకు జీవితఖైదు విధించింది. నిందితులకు కఠిన శిక్షను విధించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది ఉజ్వల్ నిఖమ్ కోరగా నిందితులే ఆయా కుటుంబాలను పోషించాల్సి ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని తీర్పును ఇవ్వాలని నిందితుల తరఫున న్యాయవాది కోరారు. ఇరు పక్షాల వాదనలను విన్న అనంతరం కోర్టు వారికి జీవితఖైదు శిక్షను ఖరారుచేసింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. శిక్ష పడినవారిలో విజయ్ జాధవ్ (19), మహమ్మద్ ఖాసీం హాఫీజ్ శేఖ్ అలియాస్ ఖాసిం బంగాలి (21), మహమ్మద్ అన్సారీ (28), అష్ఫాక్ శేఖ్ ఉన్నారు. గత ఏడాది జూలై 31న టెలిఫోన్ ఆపరేటర్‌పై, ఆగస్టు 22వ తేదీ శక్తిమిల్లు కాంపౌండ్‌లో ఓ మహిళా ఫొటోగ్రాఫర్‌పై అత్యాచారం జరిగింది. ఈ సంఘటనల్లో నిందితులందరూ ఒక్కరే కావడం విశేషం. దీంతో ఈ రెండు కేసులను ఒకేసారి విచారణలోకి తీసుకుని కోర్టు వారిని గురువారం దోషులుగా ప్రకటించింది. అనంతరం శుక్రవారం మాత్రం కేవలం టెలిఫోన్ ఆపరేటర్ కేసుకు సంబంధించి తీర్పును ప్రకటించింది.
ఫొటో జర్నలిస్ట్ కేసులో...
మహిళ ఫొటో జర్నలిస్ట్‌పై సామూహిక అత్యాచారం కేసులో దోషులకు సోమవారం శిక్ష ఖరారు చేయనున్నారు. నిందితులను దోషులుగా ప్రకటించిన కోర్టు శుక్రవారం జర్నలిస్టు కేసులోనూ శిక్షను ఖరారు చేస్తుందని అందరూ భావించారు. అయితే కేవలం టెలిఫోన్ ఆపరేటర్ కేసుకు సంబంధించి శిక్షను ప్రకటించి, మహిళ జర్నలిస్ట్ కేసుకు సంబంధించి తీర్పును సోమవారం ప్రకటించనున్నట్టు తెలిపింది. దీంతో అందరి దృష్టి మరోసారి సోమవారం ప్రకటించబోయే తీర్పుపై కేంద్రీకృతం కానుంది.
జీవితాంతం ఖైదీలుగానే..
ప్రభుత్వ న్యాయవాది ఉజ్వల్ నిఖమ్ అత్యాచారం కేసులో నలుగురు నిందితులకు జీవితఖైదు (మరణించేవరకు జైలులోనే) శిక్ష ను సెషన్స్ కోర్టు విధించడంపై ప్రభుత్వ తరఫు న్యాయవాది ఉజ్వల్ నిఖమ్ హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిందితులు ఒకటి కంటే ఎక్కువ కేసుల్లో దోషులుగా తేలితే అలాంటివారికి మరణించేవరకు ఖైదీలుగా ఉండేటట్లు కోర్టులు శిక్ష వేసే అవకాశముందన్నారు. ప్రస్తుత రెండు సామూహిక అత్యాచార కేసుల్లో నిందితులు ఒక్కరే కావడంతో కోర్టు వారికి ముంబైలోనే మొదటిసారి ఇటువంటి శిక్షను విధించిందన్నారు.
వారికి ఆ శిక్ష పడాల్సిందే..
ఏటీఎస్ చీఫ్ హిమాంశు రాయ్
టెలిఫోన్ ఆపరేటర్‌పై సామూహిక అత్యాచారం కేసులో నిందితులకు కోర్టు జీవితఖైదు విధించడంపై మహారాష్ర్ట ఏటీఎస్ చీఫ్ హిమాంశురాయ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఈ కేసు విచారణ సమయంలో క్రైం బ్రాంచ్ చీఫ్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా రాయ్ మాట్లాడుతూ.. ‘18 ఏళ్ల టెలిఫోన్ ఆపరేటర్ పై గత ఏడాది జూలై 31వ తేదీన సామూహిక అత్యాచారం జరిగింది. అయితే ఆమె నెల రోజుల తర్వాత ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలను సంపాదించడం పోలీసులకు పెనుసవాలుగా మారింది. కాగా, బాధితురాలిపై అత్యాచారం జరిగిందని భావిస్తున్న స్థలం ఎక్కువ జనసంచారం ఉన్న ప్రదేశమై ఉండి ఉంటే ఆధారాలను సంపాదించడం కష్టమై ఉండేది.. మిల్లు కంపౌండ్ స్థలం నిర్మానుష్య ప్రదేశం కావడంతో సాక్ష్యాధారాలను సంపాదించగలిగాం.. నిందితులను పట్టుకుని వారికి శిక్ష పడేలా చేయగలిగాం..’ అని ఆయన వ్యాఖ్యానించారు.
మరింత కఠిన శిక్ష అవసరం
అత్యాచారానికి పాల్పడినవారికి జీవిత ఖైదు సరిపోదు. వారికి గుణపాఠం నేర్పాలంటే ఉరి శిక్ష విధించడమే సరైన తీర్పు. అప్పుడే బాధితులకు సరైన న్యాయం చేసినట్లవుతుంది. అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అడ్డుకట్ట వేయగలుగుతాం.