mahasamund
-
చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే హవా!
సాక్షి, న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్‌లో వరి కోతల సీజన్ అయిపోయింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. అయినా దాదాపు యాభై శాతం రైతులు వరి కోతల జోలికి వెళ్లడం లేదు. ఎందుకని చంద్రకురి గ్రామంలోని మహేశ్ చంద్రేకర్ అనే రైతును ప్రశ్నించగా ఎన్నికల ఫలితాల కోసం నిరీక్షిస్తున్నామని అన్నారు. ఎన్నికల ఫలితాలకు, వరి కోతలకు సంబంధం ఏమిటని ప్రశ్నించగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సరైన గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పిందని, అందుకని, తాను వరి కోతలు జరపక పోవడమే కాకుండా జరపకూడదని తోటి రైతులకు సలహా కూడా ఇచ్చానని ఆయన చెప్పారు. అప్పటి వరకు పంటను తరలించకపోతే నష్టం వాటిల్లా అది ప్రశ్నిస్తే, డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయని, అప్పటి వరకు భూమిలో తేమ ఉంటుంది కనుక నష్టం వాటిల్లదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే అప్పటికైనా పాత రేటుకు అమ్ముకోవాల్సిందేనని ఆయన తెలిపారు. ఈసారి కోతల సీజన్ ప్రారంభమైన నవంబర్ ఒకటవ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు రాష్ట్రంలో వడ్ల సేకరణ 4,67,438 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. గతేడాది ఇదే కాలానికి సేకరించిన వడ్లతో పోలిస్తే ఇది సగానికిపైగా పడిపోయింది. గతేడాది ఇదే కాలానికి 10,47,454 మెట్రిక్ టన్నులు సేకరించినట్లు అధికారిక మార్కెట్ లెక్కలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభతో రైతుల్లో ఈ మార్పు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. నవంబర్ 13న మహాసముంద్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పది రోజుల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని, వరి పంట కనీస మద్దతు ధరను 2500 రూపాయలను చేస్తామని చెప్పారు. గత బీజేపీ ప్రభుత్వం వరి మద్దతు ధరను 2100 రూపాయలను ప్రకటించినప్పటికీ 1750 రూపాయలనే చెల్లించిందని ఆయన విమర్శించారు. దేశంలో కేవలం 15 మందికి చెందిన మూడున్నర లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రైతుల రుణాలను మాఫీ చేయలేక పోతున్నారని విమర్శించారు. చత్తీస్‌గఢ్ జనాభాలో 70 శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. వారిలో 46 శాతం మంది చిన్నకారు, సన్నకారు రైతులే. 2015 నుంచి 2017 మధ్య వ్యవసాయ సంక్షోభం వల్ల రాష్ట్రంలో 1,344 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రాహుల్ మాటలను పూర్తిగా విశ్వసించిన రైతులు రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు. 15 ఏళ్ల రమణ్ సింగ్ ప్రభుత్వం పట్ల తాము పూర్తిగా విశ్వాసం కోల్పోయామని రైతులు చెబుతున్నారు. 2022 సంవత్సరం నాటికల్లా దేశలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ మాటలను గుర్తు చేయగా, ఈ నాలుగేళ్ల కాలంలో రైతుల ఆదాయం ఏమాత్రం పెరగక పోగా వ్యవసాయం సంక్షోభంలో పడిందని, అలాంటప్పుడు ఆయన మాటలు ఎలా నిజం అవుతాయని రైతులు అంటున్నారు. ప్రధాని పేదలు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారని, గ్యాస్ ఫిల్లింగ్‌కు 900 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలని, ఉచితంగా బ్యాంక్ ఖాతాలు ఇప్పించారని, అది మురిగిపోకుండా ఉండాలంటే వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయాలంటా, ఎక్కడి నుంచి తేవాలని రైతులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. వారి విశ్వాసం చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌దే హవా! అనిపిస్తోంది. -
ఈసారి ‘మహాసముంద్’లో మార్పు!
సాక్షి, న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్ రెండో విడత పోలింగ్‌కు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మహాసముంద్ జిల్లాలో వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉండడంతో జిల్లాలోని రైతులు, దినసరి కూలీలు అలమటిస్తున్నారు. మహాసముంద్ పట్టణంలోని రోడ్డెక్కితే పక్కనున్న టీ దుకాణం ముందు కూలీల గుంపు కనిపిస్తోంది. ఎవరైనా తమకు పనికి తీసుకుపోతారన్న ఆశతో వారక్కడ ప్రతిరోజు పడిగాపులు గాస్తారు. దీపావళి పండుగ నాటి నుంచి తమకు ఏపని దొరకడం లేదని వారు వాపోతున్నారు. ఎన్నికలు ముగిసే వరకు పరిస్థితి ఇలాగే ఉండవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ సీట్లకుగాను 18 సీట్లకు నవంబర్ 12వ తేదీన మొదటి విడత పోలింగ్ జరిగింది. మిగతా సీట్లకు నవంబరం 20వ తేదీన పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో వ్యవసాయమనేది ఏమాత్రం గిట్టుబాటులేని వ్యవహారం అయిపోయినదని, కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా వెనక్కి రావడం లేదని నయపరా గ్రామానికి చెందిన దౌలత్ రామ్ గురు వాపోయారు. రాష్ట్రంలోని రామన్ సింగ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వల్లనే తమకు ఈ పరిస్థితి దాపురించిందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. తాము కూడా అలాగే అనుకుంటున్నామని రోజువారి పనికోసం నిరీక్షిస్తున్న కూలీలు చెప్పారు. బీజేపీ పాలనతో రాష్ట్రం స్తంభించిపోయిందని, తాము ఈ సారి మార్పును కోరుకుంటున్నామని సోహ్రి గ్రామానికి చెందిన సియారామ్ యాదవ్ అనే రైతు తెలిపారు. మహాసముంద్లో నవంబర్ 13న జరిగిన రాహుల్ గాంధీ ర్యాలీకి ప్రజలు భారీ ఎత్తున తరలి రావడానికి కారణం కూడా ప్రభుత్వంపైనున్న వ్యతిరేకతే కారణమని ప్రజలు తెలిపారు. రమణ సింగ్, ఆయన కుటుంబం అవినీతి గురించి రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడుగానీ, రఫేల్ ఒప్పందంతో ప్రధాని మోదీ తన మిత్రులకు దోచిపెట్టారని పదే పదే మాట్లాడినప్పుడు కూడా ప్రేక్షకులు మౌనంగానే ఉన్నారు. క్రోని క్యాపిటలిస్టులైన అనిల్ అంబానీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలకు మోదీ సహకరించారని ఆరోపించినప్పుడు కూడా ప్రజల నుంచి స్పందన లేదు. పేదల నుంచి డబ్బు లాక్కొని ధనికులకు పంచడానికే మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును తీసుకొచ్చిందని ఆరోపించినప్పుడూ కూడా ప్రజల నుంచి అంతగా స్పందన లేదు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడడం మొదలుపెట్టగానే ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. మోదీ ప్రభుత్వం రైతులకు ఎన్నో హామీలిచ్చి వాటిని అమలు చేయలేక పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటన్నింటిని అమలు చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రైతుల రుణాలను మాఫీ చేస్తుందని, వరి కనీస మద్దతు ధరను రెండున్నర వేల రూపాయలకు పెంచుతుందని రాహుల్ ప్రకటించగానే ప్రేక్షకులు ముక్తకంఠంతో ‘రాహుల్ గాంధీకీ జై, కాంగ్రెస్ పార్టీకి జై అంటూ నినదించారు. దేశంలో 15 మంది బడా బాబులు తీసుకున్న 3,50,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం దేశంలోని, చత్తీస్‌గఢ్‌లోని రైతుల రుణాలను మాఫీ చేయలేదని రాహుల్ విమర్శించినప్పుడు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. రాహుల్ గాంధీ నిజంగా రైతుల రుణాలను మాఫీ చేసినట్లయితే జీవితకాలం తమ కుటుంబం కాంగ్రెస్‌కే ఓటు వేస్తుందని కమర్ముర్హా గ్రామం నుంచి తోటి రైతులతోని వచ్చిన రైతు అల్కేశ్వర్ పూరి చెప్పారు. తాను తిరిగిన పలు ప్రాంతాల్లో కూడా ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. -
నేములోనేముంది?
జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంది. కానీ ఛత్తీస్ గఢ్ నేత అజిత్ జోగి తలచుకుంటే ఒకే పేరున్న క్యాండిడేట్ల వర్షం కురుస్తుంది. ఛత్తీస్ గఢ్ లోని మహాసముంద్ నుంచి లోకసభ ఎన్నికల బరిలో ఉన్న అజిత్ జోగి తన బిజెపి ప్రత్యర్థి చందూలాల్ సాహూని ఓడించేందుకు ఒకటి కాదు, ఇద్దరు కాదు ఏకంగా పది మంది సాహూలతో నామినేషన్ వేయించారు. వీరందరి పేరూ బిజెపి అభ్యర్థి పేరే! వీరిలో ఆరుగురు చందులాల్ సాహూలు. ఒకరు చందూరామ్ సాహూ.మిగతా వారందరి పేరులోనూ సాహూ ఉంది. కాబట్టి బిజెపి ఓటర్లు కన్ ఫ్యూజ్ అయిపోయి ఒక చందూరామ్ కి వేయాల్సిన ఓటు ఇంకో చందూరామ్ కి వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాగోలా మహాసముంద్ ఎన్నికల సముద్రం ఈదేయచ్చునన్నదే జోగి గారి ప్లాన్. ఈ సాహూలందరినీ విత్ డ్రాచేయించాలని బిజెపి ఎంతో ప్రయత్నించింది. కానీ అందరూ అజ్ఞాతంలోకి వెళ్లడమే కాదు, వాళ్ల ఫోన్లు కూడా స్విచాఫ్ అయిపోయాయట. ఇప్పుడు మహాసముంద్ లో బిజెపి అభ్యర్థి బుర్ర స్విచాఫ్ అయిపోయింది. జోగితో పోరాడాలా లేక సాహూలతో పోరాడాలా అన్నది పాపం ఒరిజినల్ చందూలాల్ సాహూకి అర్థం కావడం లేదట.