సాక్షి, న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్ రెండో విడత పోలింగ్‌కు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మహాసముంద్ జిల్లాలో వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉండడంతో జిల్లాలోని రైతులు, దినసరి కూలీలు అలమటిస్తున్నారు. మహాసముంద్ పట్టణంలోని రోడ్డెక్కితే పక్కనున్న టీ దుకాణం ముందు కూలీల గుంపు కనిపిస్తోంది. ఎవరైనా తమకు పనికి తీసుకుపోతారన్న ఆశతో వారక్కడ ప్రతిరోజు పడిగాపులు గాస్తారు. దీపావళి పండుగ నాటి నుంచి తమకు ఏపని దొరకడం లేదని వారు వాపోతున్నారు. ఎన్నికలు ముగిసే వరకు పరిస్థితి ఇలాగే ఉండవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోని 90 అసెంబ్లీ సీట్లకుగాను 18 సీట్లకు నవంబర్ 12వ తేదీన మొదటి విడత పోలింగ్ జరిగింది. మిగతా సీట్లకు నవంబరం 20వ తేదీన పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో వ్యవసాయమనేది ఏమాత్రం గిట్టుబాటులేని వ్యవహారం అయిపోయినదని, కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా వెనక్కి రావడం లేదని నయపరా గ్రామానికి చెందిన దౌలత్ రామ్ గురు వాపోయారు. రాష్ట్రంలోని రామన్ సింగ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వల్లనే తమకు ఈ పరిస్థితి దాపురించిందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. తాము కూడా అలాగే అనుకుంటున్నామని రోజువారి పనికోసం నిరీక్షిస్తున్న కూలీలు చెప్పారు. బీజేపీ పాలనతో రాష్ట్రం స్తంభించిపోయిందని, తాము ఈ సారి మార్పును కోరుకుంటున్నామని సోహ్రి గ్రామానికి చెందిన సియారామ్ యాదవ్ అనే రైతు తెలిపారు.
మహాసముంద్‌లో నవంబర్ 13న జరిగిన రాహుల్ గాంధీ ర్యాలీకి ప్రజలు భారీ ఎత్తున తరలి రావడానికి కారణం కూడా ప్రభుత్వంపైనున్న వ్యతిరేకతే కారణమని ప్రజలు తెలిపారు. రమణ సింగ్, ఆయన కుటుంబం అవినీతి గురించి రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడుగానీ, రఫేల్ ఒప్పందంతో ప్రధాని మోదీ తన మిత్రులకు దోచిపెట్టారని పదే పదే మాట్లాడినప్పుడు కూడా ప్రేక్షకులు మౌనంగానే ఉన్నారు. క్రోని క్యాపిటలిస్టులైన అనిల్ అంబానీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలకు మోదీ సహకరించారని ఆరోపించినప్పుడు కూడా ప్రజల నుంచి స్పందన లేదు. పేదల నుంచి డబ్బు లాక్కొని ధనికులకు పంచడానికే మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును తీసుకొచ్చిందని ఆరోపించినప్పుడూ కూడా ప్రజల నుంచి అంతగా స్పందన లేదు.
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడడం మొదలుపెట్టగానే ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. మోదీ ప్రభుత్వం రైతులకు ఎన్నో హామీలిచ్చి వాటిని అమలు చేయలేక పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటన్నింటిని అమలు చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రైతుల రుణాలను మాఫీ చేస్తుందని, వరి కనీస మద్దతు ధరను రెండున్నర వేల రూపాయలకు పెంచుతుందని రాహుల్ ప్రకటించగానే ప్రేక్షకులు ముక్తకంఠంతో ‘రాహుల్ గాంధీకీ జై, కాంగ్రెస్ పార్టీకి జై అంటూ నినదించారు.
దేశంలో 15 మంది బడా బాబులు తీసుకున్న 3,50,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం దేశంలోని, చత్తీస్‌గఢ్‌లోని రైతుల రుణాలను మాఫీ చేయలేదని రాహుల్ విమర్శించినప్పుడు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. రాహుల్ గాంధీ నిజంగా రైతుల రుణాలను మాఫీ చేసినట్లయితే జీవితకాలం తమ కుటుంబం కాంగ్రెస్‌కే ఓటు వేస్తుందని కమర్‌ముర్హా గ్రామం నుంచి తోటి రైతులతోని వచ్చిన రైతు అల్కేశ్వర్ పూరి చెప్పారు. తాను తిరిగిన పలు ప్రాంతాల్లో కూడా ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment